
గిరాయిపల్లి ఎన్‌కౌంటర్ జరిగి ఏభై ఏళ్లు. ఈ సంఘటనతో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్‌ఈసీ) విద్యార్థుల విప్లవ పోరాటం ముగిసిపోలేదు. కామ్రేడ్స్ సూరపనేని జనార్దనరావు, లంకా మురళీమోహన్ రెడ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్... ఈ నలుగురి అమరత్వం సజీవమైనది.
1974లో ప్రారంభమైన రాడికల్ విద్యార్థి యూనియన్ ప్రభావానికి గురయ్యారు గిరాయిపల్లి అమరులు. నక్సల్బరీ సైద్ధాంతిక అవగాహనతో పనిచేశారు. జనార్దనరావు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు దగ్గర గరికపర్రు గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబం. ఇంజినీరింగ్ విద్య కోసం వచ్చిన విద్యార్థి వరంగల్ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న విప్లవోద్యమంలోనూ ప్రధాన శక్తి అయ్యాడు. ఇంజనీరింగ్ విద్యను ఆఖరి సంవత్సరం వదిలి ప్రజా పోరాటాలలో భాగమయ్యాడు. విప్లవోద్యమ కర్తవ్యాన్ని దాని ప్రాసంగికతను విడవకుండా ఆనాటి యువతరంలో విప్లవ మార్గం పట్ల, అనురక్తి కలిగించగలిగాడు. 1975 జూన్ 25న తన సహచరులతో పాటు ఎన్‌కౌంటర్ అయిన సమయానికి అతడి వయసు ఇరవై అయిదేళ్లు.
ఎమర్జన్సీ తొలి నాళ్ళ కాలం అది.
గిరాయిపల్లి అమరులు తమ అమరత్వంతో పోరు విత్తనాలు చల్లారు. వీరి జ్ఞాపకార్థం గిరాయిపల్లిలో స్ఫూర్తి స్థూపం వెలిసింది. ప్రభుత్వం 1985లో ఈ స్థూపాన్ని కూల్చివేసింది. 1990లో తిరిగి నిర్మాణం జరిగింది. గిరాయిపల్లి అమరత్వాన్ని తలుచుకున్నప్పుడు మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసీ హననం గురించి మాట్లాడుకోవడం సముచితం. అరవై ఏళ్ళ విప్లవోద్యమ చరిత్రలో అణ చివేత, రక్తపాతం సాధారణమైన అంశమైంది. విప్లవకారులకు, ఆదివాసులకు భారత రాజ్యాంగ పరిధిలోని ఏ హక్కులూ వర్తించడం లేదు. జీవించే హక్కు అనుమతించడం లేదు. గిరాయిపల్లి అమరుల అమరత్వాన్ని వర్తమానం వెలుగులో చూసినప్పుడే దాని విలువ మరింత అర్థమవుతుంది.
– అరసవిల్లి కృష్ణ ‘ విరసం అధ్యక్షుడు
(గిరాయిపల్లి ఎన్‌కౌంటర్ జరిగి నేటికి 50 ఏళ్లు)