
దండకారణ్యంలో దశాబ్దాలుగా సాయుధ పోరాటం
ఇన్నాళ్లూ భద్రతా దళాలకు దడ పుట్టించిన మావోలు
కొత్త ఎత్తులతో దూసుకెళ్తున్న పోలీసు బలగాలు
ఫలితంగా అనివార్యమైన లొంగుబాట్లు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో పట్టు నిలుపుకొనేందుకు ఓ వైపు మావోయిస్టులు.. మరోవైపు భద్రతా దళాలు గడిచిన పదిహేనేళ్లుగా వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేశారు. చివరికి అపరిమితమైన వనరులు కలిగిన భద్రతా దళాల ధాటికి దండకారణ్యంలో మావోలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఎదురైంది. ఇదే చివరకు భారీ లొంగుబాట్లకు దారి తీసిందన్న చర్చ జరుగుతోంది.
రంగంలోకి పారా మిలిటరీ..
దండకారణ్యంలో 1980లో అడుగుపెట్టిన మావోయిస్టులు ఇరవై ఏళ్లకు పైగా అక్కడ తిరుగులేని శక్తిగా మారారు. మరో పదేళ్లకు ఆ పార్టీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి 12 కంపెనీలు వచ్చి చేరాయి. సాంస్కృతిక విభాగమైన చేతన నాట్యమండలి సభ్యుల సంఖ్య 7 వేలు దాటింది.
దండకారణ్యంలో ప్రబల శక్తిగా నానాటికి విస్తరిస్తున్న మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు ముందుగా సల్వాజుడుం, ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను 2009లో ప్రభుత్వం ప్రారంభించింది. సీఆర్‌పీఎఫ్, ఇండో టిబెటన్ పోలీస్, బీఎస్‌ఎఫ్ తదితర దళాలను రంగంలోకి దించింది. దీంతో మావోయిస్టులే లక్ష్యంగా భద్రతా దళాల కూంబింగ్ పెరిగింది. ఎదురు కాల్పుల్లో ఆ పార్టీ సభ్యులు నష్టపోవడం పెరిగింది.
పారా మిలిటరీని ఎదుర్కొనేలా..
వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లను సమీక్షించిన ‘దాదా’లు నాలుగు కిలోమీటర్ల నడక వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. తమ బస (క్యాంప్) సమాచారం పోలీసులు/భద్రతా దళాలకు చేరాక వారు తమను చుట్టుముట్టేందుకు ఎంత సమయం పడుతుంది, ఈ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంత సమయం అవసరం, తప్పించుకున్న తర్వాత చెల్లాచెదురైన దళాలు 24 నుంచి 72 గంటల్లోగా ఎక్కడ, ఎలా కలుసుకుంటే మంచిదనే అంశాలపై అధ్యయనం చేశారు.
గ్రామం లేదా రోడ్ పాయింట్ (పోలీసులు వాహనాలు వచ్చే స్థలం) నుంచి కనీసం నాలుగు కిలోమీటర్ల పాటు అడవిలో నడిస్తే తప్ప చేరుకోలేనంత దట్టమైన అడవిలోనే క్యాంపులు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాక తమ వద్దకు వచ్చే భద్రతా దళాలపై అంబూష్‌లు చేసే వ్యూహాలు నేర్చుకున్నారు. దీనికి తోడు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల యుద్ధరీతులను అధ్యయనం చేశాక.. వేగంగా బంకర్లు, బూబీట్రాప్స్ నిర్మించడంపై దళాలకు శిక్షణ ఇచ్చారు. దీంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌కు వెళ్లిన బలగాలు అనేకసార్లు మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకున్నాయి.
కట్టుదిట్టం చేసినప్పటికీ..
ఆపరేషన్ గ్రీన్‌హంట్ చేపట్టి పదేళ్లు దాటినా సానుకూల ఫలితం రాకపోవడంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్‌షిప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ– డ్యాష్‌బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్) తెరపైకి వచ్చింది.
మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, కొత్త రిక్రూట్‌మెంట్లు తగ్గించే పనిపై ప్రభుత్వం, బలగాలు దృష్టి సారించాయి. ఆఖరికి వాయుమార్గాన దాడులకు సైతం తెర తీశారు. ఎన్ని చేసినా 2021 ఏప్రిల్‌లో తెర్రం దగ్గర జరిగిన దాడిలో 22 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోవడం భద్రతా దళాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. అంతేకాక మావోలను ఎదుర్కొనేందుకు మరో కొత్త వ్యూహం భద్రతా దళాలకు అవసరం పడింది.
4 కిలోమీటర్ల ప్రణాళిక
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక పారామిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసే ప్రణాళికకు 2019లో శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం అడవిలో క్యాంప్ ఏర్పాటుచేసి 24 గంటలూ జవాన్లు అక్కడే ఉంటారు. ఆ క్యాంప్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిత్యం కూంబింగ్ చేస్తారు. అలా మావోలను మరింతగా అడవి లోపలికి నెట్టేస్తారు.
నెల వ్యవధిలోనే ఆ ప్రాంతంపై పట్టు సాధించి అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన మరో కొత్త క్యాంప్ ఏర్పాటు చేస్తారు. క్యాంపుతో పాటే భారీ వాహనాలు తిరిగేలా తాత్కాలిక రోడ్లు, మొబైల్ టవర్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. ఇలా రెండేళ్లలోనే 300కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ప్రాంతంపై పట్టున్న డీఆర్‌జీ దళాలు ప్రభుత్వ అమ్ముల పొదిలో వచ్చి చేరాయి.
దండకారణ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావాల్సి వచ్చింది.