
దండకారణ్యం నుంచి రెండు బృందాలుగా బయటకు
ఆశన్న, రణిత నాయకత్వంలో బైరాంగఢ్‌కు 170 మంది పయనం
నేడు ప్రభుత్వ పెద్దల సమక్షంలో అధికారికంగా లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్‌తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌సహా 61 మంది బుధవారం లొంగిపోగా, ఛత్తీస్‌గఢ్‌లో అంతకు దాదాపు మూడింతల మంది అడవిని వీడి బయటకు రాబోతున్నారు. 170 మందికి పైగా మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయేందుకు రెండు బృందాలుగా బయలుదేరారు.
ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. దండకారణ్యంలోని మడ్ అడవుల నుంచి ఒక భారీ బృందం రణిత నేతృత్వంలో అడవిని వీడి కాంకేర్ జిల్లాలోకి చేరింది. తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో మరో 140 మంది బృందం ఇంద్రావతి నదిని దాటి బీజాపూర్ జిల్లాలోని ఒకప్పటి మావోయిస్టుల కంచుకోట బైరాంగఢ్‌కు చేరుకోనుంది. ఇక్కడి నుంచి వీరంతా జగదల్‌పూర్‌కు చేరుకునే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో శుక్రవారం వీరంతా ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసే కార్యక్రమం జరగనుంది.
సందేహాలకు తావులేకుండా..
మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు సమయంలో బుధ వారం కనిపించిన దృశ్యాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. మల్లోజుల బృందం చాన్నాళ్లుగా పోలీసులకు టచ్‌లో ఉన్నారని, లొంగిపోయినప్పుడు సమర్పించిన ఆయుధాలు సైతం ప్రభుత్వానివే అనే ప్రచారం సాగింది. దీంతో ఇలాంటి సందేహాలు మరోసారి తలెత్తకుండా ఆశన్న లొంగుబాటు విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగానే 50 మందితో కూడిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జెడ్‌సీ) సభ్యుడు భాస్కర్, దండకారణ్యం మాడ్ డివిజన్ ఇన్‌చార్జి రణిత బృందం అడవిని వీడి ఆయుధాలతో బయటకు వచ్చే వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
బుధవారం ఉదయం అబూజ్‌మడ్‌లోని హండావాడా జలపాతం నుంచి ఇంద్రావతి నేషనల్ పార్కు మీదుగా 140 మందికి పైగా సాయుధ మావోయిస్టులతో బయల్దేరిన ఆశన్న బృందం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రావతి నదిని దాటి ఉస్పారీ ఘాట్ మీదుగా భైరాంగఢ్ వైపుగా సాగుతోంది. ఈ బృందాల ప్రయాణం సాఫీగా సాగేలా పోలీసు శాఖ నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది ఆలివ్ గ్రీన్ దుస్తులకు బదులుగా సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు.
హండావాడా జలపాతం కేంద్రంగా
అబూజ్‌మడ్‌లోని దట్టమైన అడవుల్లో ఛత్తీస్‌గఢ్ వైపు హండావాడా జలపాతం ఉంది. ఇక్కడే లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న ముఖ్య నేతలు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ నాటికి ఏ బృందాలు ఎలా వెళ్లాలి, ఎక్కడ లొంగిపోవాలి, వెళ్లే మార్గంలో అడ్డంకులు ఎదురుకాకుండా అవసరమైన శక్తులతో ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశంపై స్పష్టత వచ్చినట్టు సమాచారం.
6వ తేదీన కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు, ప్రజలకు క్షమాపణ చెబుతున్నట్టుగా మల్లోజుల నుంచి 22 పేజీల లేఖ జారీ అయింది. ఈ నెల 13న లొంగిపోయే మావోయిస్టులు అడవి నుంచి బయటకు రావడం మొదలైంది. 14న మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు మల్లోజుల బృందం చేరుకోగా, 15న ఆయన లొంగుబాటును అధికారికంగా ప్రకటించారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, సుక్మా జిల్లాల్లో మరో 78 మంది లొంగిపోయారు.