అందరూ ప్రేమకథే చూశారు.. అసలు కథ వేరే ఉంది! | Army Captain Viral Proposal Not the Real Story | Sakshi
Sakshi News home page

అందరూ ప్రేమకథే చూశారు.. అసలు కథ వేరే ఉంది!

Jun 6 2026 11:39 AM | Updated on Jun 6 2026 11:51 AM

Army Captain Viral Proposal Not the Real Story

భారత సైన్యానికి చెందిన కెప్టెన్‌ భరత్‌ భరద్వాజ్‌ తన కాబోయే భార్య ఆరోషికి యూనిఫామ్‌లో.. అదీ ఆర్మీ హెలికాప్టర్‌లో ప్రపోజ్‌ చేసిన వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. విధుల్లో ఉండగా ఇవేం పనులంటూ ఆర్మీ అధికారులతో సహా కొందరు దీనిని ఖండించారు. మాజీల్లో కొందరు మాత్రం ‘ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు?’ భరద్వాజ్‌కు సపోర్ట్‌ చేశారు.  అయితే ఆ రొమాంటిక్‌ దృశ్యం వెనుక.. అత్యంత కీలకమైన ఓ అంశాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.

కెప్టెన్‌ భరత్‌ భరద్వాజ్‌ భారత సైన్యంలో యంగ్‌ ఆర్మీ ఏవియేషన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అధికారి. ఇటీవలే హెలికాప్టర్‌ పైలట్‌గా శిక్షణ పూర్తి చేసి యూనిఫామ్‌లో ఫ్రంట్‌లైన్‌ సర్వీస్‌కు సిద్ధమయ్యాడు. అతని కాబోయే భార్య ఆరోషి, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, అధికారిక శిక్షణ పూర్తి అయిన సందర్భంలో భరద్వాజ్‌ చేసిన ఈ ప్రత్యేక ప్రపోజల్‌ క్షణాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. యువ వయసులో ఉన్న ఈ జంటకు సంబంధించిన ఈ రొమాంటిక్‌ ఘటన ఒకవైపు చర్చనీయాంశంగా మారితే, మరోవైపు యూనిఫామ్‌లో వ్యక్తిగత జీవితం ఎంతవరకు సమంజసం అన్న డిబేట్‌కు కూడా దారితీసింది.

భరద్వాజ్‌ ప్రపోజల్‌ కోసం ఉపయోగించిన హెలికాప్టర్‌ ‘చీతా’. గత 50 ఏళ్లుగా భారత సైన్యం దాని మీదే ఆధారపడి ఉంటోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరోస్పటియల్‌ సంస్థ డిజైన్‌ చేసిన ఈ హెలికాప్టర్‌ను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) 1970ల నుంచి భారత్‌లో తయారు చేస్తోంది. సియాచిన్‌ వంటి అత్యంత ఎత్తైన, క్లిష్టమైన ప్రాంతాల్లో సైనిక రవాణా, గాయపడిన వారిని తరలించడం, సరఫరాలు అందించడం వంటి కీలక బాధ్యతలను ఇది నిర్వర్తిస్తోంది. కానీ దీని భద్రతపై చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

1974 నుంచి 2022 మధ్య కాలంలో చీతా హెలికాప్టర్లు 60కి పైగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మొన్న.. మే 20న లడఖ్‌లోని టాంగ్‌స్టే ప్రాంతంలో మరో చీతా హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఇందులో ఉన్న ముగ్గురు సైనిక అధికారులు ప్రాణాపాయం నుంచి బయటపడినా.. ఇప్పుడు ఈ ప్రేమకథ పుణ్యమాని ప్రమాదాల పరంపరను మరోసారి కొందరు చర్చకు తీసుకొచ్చారు. 

అలాగని చీతా మాత్రమే కాదు, దాని సోదర మోడల్‌ ‘చేతక్‌’ హెలికాప్టర్‌ కూడా ప్రమాదాల పరంగా చెడు రికార్డే కలిగి ఉంది. ఆర్మీ వైవ్స్‌ అజిటేషన్‌ గ్రూప్‌ (AWAG) వివరాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో చీతా-చేతక్‌ హెలికాప్టర్లకు సంబంధించిన దాదాపు 191 ప్రమాదాల్లో 294 మంది పైలట్లు మరణించారు. ఈ కారణంగానే వీటిని కొందరు “ఫ్లయింగ్‌ కాఫిన్స్‌” (ఎగిరే శవపేటికలు)గా కూడా అభివర్ణించారు.

వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే ఆధునిక సాంకేతికత, నావిగేషన్‌ వ్యవస్థలు లేకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరిగాయని మాజీ వైమానిక దళ అధికారి ఎయిర్‌ మార్షల్‌ జీఎస్‌ బేడీ అభిప్రాయపడ్డారు. దీంతో 2027 నుంచి చీతా, చేతక్‌ హెలికాప్టర్లను దశలవారీగా సేవల నుంచి తప్పించాలని సైన్యం, వైమానిక దళం నిర్ణయించాయి. వాటి స్థానంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన HAL లైట్‌ యుటిలిటీ హెలికాప్టర్‌ (LUH)ను తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినా, సర్టిఫికేషన్‌ వివాదాలు, సాంకేతిక అడ్డంకుల కారణంగా ఆ ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఒకవైపు వైరల్‌ ప్రపోజల్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే.. మరోవైపు అదే హెలికాప్టర్‌లో ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలు మాత్రం ఆధునిక ప్రత్యామ్నాయాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాయి. సియాచిన్‌ నుంచి లడఖ్‌ వరకు ఎన్నో విజయవంతమైన మిషన్లకు చీతా సాక్ష్యమైనా, దాని వయసు మీద పడడం, ప్రమాదాల చరిత్ర ఇప్పుడు భారత సైన్యానికి పెద్ద సవాలుగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement