
‘‘ఆంటీ.. భోపాల్ దగ్గర్లో ఉన్నా..’’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఆ తర్వాత పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇంటికి దూరంగా హాస్టల్‌లో ఉంటూ సివిల్ జడ్జి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అర్చనా తివారీ(28).. రాఖీ పండుగకు ఇంటికి రైలులో బయల్దేరి అనూహ్యరీతిలో అదృశ్యం కావడం మధ్యప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కట్నీకి చెందిన అర్చనా తివారీ.. ఆగస్టు 7వ తేదీన ఇండోర్ నుంచి సొంతూరుకు బయల్దేరేందుకు ఇండోర్-బిలాస్‌పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరింది. రాత్రి 10.16గం. టైంలో చివరిసారిగా ఆమె తన దగ్గరి బంధువుతో ఫోన్‌లో మాట్లాడింది. అయితే ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయింది.
👉ఆగస్టు 8వ తేదీ.. తెల్లవారు జామున.. కట్నీ సౌత్ స్టేషన్‌లో అర్చన రైలు దిగలేదు. కుటుంబ సభ్యులు ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆందోళన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈలోపు ఆమె బంధువు ఒకరు తర్వాతి స్టేషన్ ఉమారియాలో ఆమె బెర్త్ వద్ద బ్యాగ్‌ను గుర్తించారు.
👉ఆగస్టు 9-11వ తేదీ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మూడు బృందాలుగా విడిపోయారు. భోపాల్, కట్నీ, ఇండోర్, నర్మదాపురం ప్రాంతాలను రెండ్రోజులపాటు జల్లెడ పట్టారు. చివరిసారిగా ఆమె ఫోన్ సిగ్నల్ నర్మదా రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తించారు. దీంతో ఎస్డీఆర్‌ఎఫ్, హోంగార్డుల బృందాలతో నదిలో గాలించారు.

👉ఆగస్టు 12వ తేదీ.. 100 గంటల గాలింపు తర్వాత కూడా అర్చన గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. రాణి కమలపతి స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీల్లో ఆమె కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు సైతం అది అర్చననేని ధృవీకరించలేకపోయారు. ఈలోపు.. అర్చన కేసు సెన్సేషన్ కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం సైతం పోలీస్ శాఖపై ఒత్తిడి పెంచింది. దీంతో అర్చన ఆచూకీ పేరిట పోస్టర్లు వెలిశాయి.
👉ఆగస్టు 13వ తేదీ.. అర్చనా తివారీ మిస్సింగ్ కేసులో ఒక మేజర్ క్లూ దొరికిందని భోపాల్ రైల్వే పోలీసులు ప్రకటించారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డాటా రికార్డులు, కాల్ డిటైల్ రికార్డుల ఆధారంగా ఆమెను ఆచూకీని గుర్తించినట్లు ప్రకటించారు.
👉ఆగస్టు 14వ తేదీ.. నర్మదాపురం పిపరియాలో అర్చనను చూశామంటూ కొందరు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భోపాల్ రైల్వే పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కబురు పంపారు. తమ సోదరి క్షేమంగా ఉండే ఉంటుందని.. ఆమెను వెంట పెట్టుకునే తిరిగి వెళ్తామంటూ ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

👉ఆగస్టు 15వ తేదీ.. అర్చన సొంతూరికి బయల్దేరిన విషయాన్ని ఆమె ఉంటున్న హస్టల్ ఓనర్ ధృవీకరించారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇదివరకే మీడియాకు విడుదల చేసినట్లు గుర్తు చేశాడు. అర్చనా తివారీ దొరికిందని భోపాల్ పోలీసులు ప్రకటించి.. 48 గంటలు గడుస్తోంది. కానీ, ఇప్పటిదాకా ఆ వివరాలేవీ మీడియాకు వెల్లడించలేదు. ఆమె తనంతట తానుగా వెళ్లిందా? ఎవరైనా ఎత్తుకెళ్లారా? అసలు ఆమె ఎలా అదృశ్యమైంది?.. ఈ మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.