
ఢిల్లీః: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమో ఉందో ఈ ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడూ రైతులను పెద్దగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. మరోసారి కూడా అదే పునరావృతం చేసింది. తాజాగా ఏపీలోని మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతుంటే.. బాబు సర్కారు మాత్రం చర్యల్లో ఫెయిల్ అయ్యింది.
తాజాగా ఈరోజు(మంగళవారం. జూలై 08) ఏపీలోని మామిడి రైతుల గిట్టుబాటు ధరకు సంబంధించి ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఏపీలోని మామిడి రైతులకు కిలో గిట్టుబాట ధర రూ. 4 ఇస్తే చాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనికి మళ్లీ వినతి పత్రం కూడా సమర్పించారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. ఈ మాత్రం దానికి కేంద్ర మంత్రిని కలవడం ఎందుకు? వినతి పత్రం ఇవ్వడం ఎందుకు? అనే విమర్శ వినిపిస్తోంది.
కనీసం కర్ణాటకకు ఇచ్చిన గిట్టుబాటు ధర కూడా లేదు..
ఇక్కడ ఓ విషయాన్ని గమనిస్తే.. చంద్రబాబు సర్కారుకు ఏపీలోని రైతులపై ఎంత శ్రద్ధం ఉందో అనే విషయం అవగతమవుతుంది. కనీసం కర్ణాటకలో మామిడి రైతుకు ఇచ్చే కనీస మద్దతు ధర కిలోకు రూ. 16గా ఉంది. మరి ఆ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే మద్దతు ధర కూడా ఇప్పించలేకపోయింది బాబు సర్కార్. మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది, కనీసం కర్ణాటక తరహా రేటైనా ఇవ్వండని అడగలేదు బాబు ప్రభుత్వం. దాంతో రైతు సమస్యలపై బాబు నేతృత్వంలోని ప్రభుత్వానికి సీరియస్‌నెస్,సిన్సియారిటీ లేవని విషయం అర్థమైంది.
మొక్కుబడిగా, హడావుడిగా..
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మామిడి రైతులకు మద్దతుగా పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మొక్కుబడిగా, హడావుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశారు. ఎంఐఎస్ స్కీం కింద కిలో నాలుగురూపాయల చొప్పున 260 కోట్లిస్తే చాలని అచ్చెన్నాయుడు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే మామిడికి ధర లేక రైతులు చెట్టను నరికేసుకుంటున్న నేపథ్యంలో ఈ ధరతో వారిని ఉద్ధరించాలని అనుకోవడం నిజంగా సిగ్గు చేటని విమర్శలు వస్తున్నాయి.