ఎన్నికల తర్వాత ‘సోనార్‌ బంగ్లా’కు పునర్‌ వైభవం  | Amit Shah prays for Sonar Bangla post-2026 polls | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత ‘సోనార్‌ బంగ్లా’కు పునర్‌ వైభవం 

Sep 27 2025 6:30 AM | Updated on Sep 27 2025 6:30 AM

Amit Shah prays for Sonar Bangla post-2026 polls

సాకారం చేయాలని దుర్గామాతను ప్రార్థించా 

కోల్‌కతాలో కేంద్రహోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్య 

బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతేంటన్న టీఎంసీ 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రం కోల్పోయిన ‘సోనార్‌ బంగ్లా’(బంగారు బెంగాల్‌)పునర్‌వైభవాన్ని సాకారం చేయాలని దుర్గామాతను కోరుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. రాష్ట్రం మరోసారి సురక్షితంగా, సుసంపన్నంగా మారాలని, నోబెల్‌ గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్‌ కల సాకారం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్తర కోల్‌కతాలోని సంతోష్ మిత్ర స్క్వేర్‌లో ఏర్పాటైన దుర్గా పూజ మంటపాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. 

‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల అనంతరం బంగారు బెంగాల్‌ కలను సాకారం చేసే ప్రభుత్వం ఏర్పాటు కావాలని దుర్గా మాతను కోరుకున్నా. మరోసారి మన బెంగాల్‌ శాంతియుతం, సుసంపన్నం, సురక్షితంగా రూపుదిద్దుకుంది. విశ్వకవి రవీంద్రుడు కన్న కలలు సాకారమయ్యేలా రాష్ట్రాన్ని నిర్మించుకుందాం’అని ఆయన పిలుపునిచ్చారు. దుర్గా పూజ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ వాసులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

తొమ్మిది రోజుల నవరాత్రి వేడుకలు బెంగాల్, భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ ముఖ్యమైనవే. బెంగాల్‌లో ఈ గొప్ప సంప్రదాయాన్ని యావత్‌ ప్రపంచం ఎంతో ఆనందంతో చూస్తోంది. తొమ్మిది రోజుల పాటు, బెంగాల్‌లోని ప్రతి ఒక్కరూ శక్తి ఆరాధనకు తమను తాము అంకితం చేసుకుంటారు’అని ఆయన అన్నారు. 

‘దుర్గా పూజ పండుగ బెంగాల్‌ను కొత్త శిఖరాలకు నడిపించాలి, రాష్ట్రం అభివృద్ధి చెంది, మన నేత నరేంద్ర మోదీ ఊహించిన అభివృద్ధి చెందిన భారతదేశం కలను మనం సాకారం చేసుకోగలగాలి’అని అమిత్‌ షా చెప్పారు. ‘పండగ వేళ రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విచారకరం. వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను’అని ఆయన అన్నారు. అనంతరం అమిత్‌ షా సాల్ట్‌లేక్‌ ప్రాంతంలో బీజేపీ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసిన దుర్గా పూజ మంటపాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ 205వ జయంతి సందర్భంగా నివాళులరి్పంచారు.

అమిత్‌ షా వ్యాఖ్యలపై మండిపడ్డ టీఎంసీ 
ఎన్నికల తర్వాత సోనార్‌ బంగ్లా సాకారం కావాలన్న హోం మంత్రి వ్యాఖ్యలపై టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ మండిపడ్డారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ‘అమిత్‌ షా సోనార్‌ బంగ్లాను గురించి మాట్లాడుతున్నారా? సోనార్‌ బిహార్, సోనార్‌ గుజరాత్, సోనార్‌ మహారాష్ట్ర లేక యూపీ సాకారమయ్యాయా? నిధులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఇస్తున్నారు కదా?’అని అభిషేక్‌ వ్యాఖ్యానించారు. 

‘ముందుగా మాకు రావాల్సిన రూ.2 లక్షల కోట్ల నిధుల విషయం అడగండి. నేను అబద్ధమాడుతున్నానని అమిత్‌ షా అంటే, వాస్తవాలు, గణాంకాలతో వస్తా, చర్చ ఎక్కడైనా రెడీ’అని సవాల్‌ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ.2 లక్షల కోట్ల నిధులను నిలిపేసి, రాష్ట్రానికి చెందిన మహనీయులను నిర్లక్ష్యం చేసిందన్నారు. కోల్‌కతాలోని విద్యాసాగర్‌ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం 2019లో బీజేపీ ర్యాలీ సమయంలో విరిగిపోగా ఆ పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement