పరిమిత వనరులతోనే కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం | Amit Shah Hails India Handling Of Covid Pandemic | Sakshi
Sakshi News home page

పరిమిత వనరులతోనే కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం

Sep 29 2021 4:56 AM | Updated on Sep 29 2021 4:56 AM

Amit Shah Hails India Handling Of Covid Pandemic - Sakshi

న్యూఢిల్లీ: వనరులు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ భారత్‌ ప్రపంచంలోని మిగతా దేశాల కంటే సమర్థంగా ఎదుర్కొందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. మహమ్మారిపై పోరాటంలో మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో ప్రభుత్వం విజయం సాధించిందనీ, ఏ తటస్థ ఏజెన్సీతో అధ్యయనం చేయించినా ఇదే విషయం నిర్ధారణ అవుతుందని ఆయన అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) 17వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

మహమ్మారి సమయంలో విశేష సేవలందించిన ఎన్‌డీఎంఏ బృందాలను ఆయన ప్రశంసించారు. ఎలాంటి విపత్తు సంభవిం చినా తక్షణం స్పందించేలా పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 350 జిల్లాల్లో ‘ఆపద మిత్ర’కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోందని వెల్లడించారు. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ ఎలా స్పందించాలి, ప్రజలను ఆపద నుంచి ఎలా కాపాడాలి వంటి విషయాలపై ఇందులో శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టులో పాలుపంచుకునే వారికి బీమా సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి 28 రాష్ట్రాలతో ఒప్పందాలు కూడా జరిగా యన్నారు. వరదలు తరచూ సంభవించేందుకు అవకాశం ఉన్న 25 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో చేపట్టిన ‘ఆపద మిత్ర’పైలట్‌ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిందని చెప్పారు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాన్లు సంభవించినప్పటికీ ముందస్తు ప్రణాళిక, అప్రమత్తత కారణంగా ఎక్కడా ఒక్క ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా దెబ్బతినలేదన్నారు. ఆస్పత్రులు, ఆక్సిజన్‌ ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం కూడా సంభవించలేదని వివరించారు. 1999లో ఒడిశాలో సంభవించిన తుపానులో 10వేల ప్రజలు ప్రాణాలు కోల్పోగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు సంభవించిన మూడు తుపాన్లలో 50 మంది కంటే తక్కువగానే మృతి చెందారన్నారు. ఎలాంటి విపత్తులోనైనా సరే ప్రాణనష్టం వాటిల్లకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. పిడుగుపాట్లు వంటి వాటికి అమల్లోకి వచ్చిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థతో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement