
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల అనంతరం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న తాజా నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తోంది. ప్రధానంగా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు(న్యాయవాదులు) తమ నిరసన స్వరం పెంచారు. ఆ జడ్జి మాకొద్దంటూ ఇప్పటికే సీజేఐకి లేఖ రాసిన బార్ సభ్యులు.. మరోమారి అదే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతున్నారు.
‘ ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు విషయాన్ని క్లియర్ గా లేఖ ద్వారా తెలియజేశాం. ఆయన్ని ఇక్కడకు(అలహాబాద్ హైకోర్టు) బదిలీ చేయవద్దని కోరాం. ఎందుకంటే ఏ కోర్టు అయినా చెత్త పడేసి ప్లేస్ కాదు కదా. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిగి క్లీన్ చీట్ వచ్చే వరకూ జస్టిస్ వర్మ అక్కడే ఉండాలి.
జస్టిస్ వర్మ అక్కడే ఉంటే సుప్రీంకోర్టు కూడా ఆయనపై విచారణను చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆయన ఇప్పటివరకూ ఇచ్చిన తీర్పులు అన్నింటిపై రివ్యూ చేయాలి. ప్రజల్లో నమ్మకం చూరగొనాలంటే ఆయన తీర్పులపై మళ్లీ సమీక్షలు అవసరం. సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించాలి’ అని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు.