‘కేజ్రీవాల్‌.. మొసలి కన్నీళ్లు కార్చొద్దు‘ | Akali Dal Slams Arvind Kejriwal Over Farm Laws Implementation In Delhi | Sakshi
Sakshi News home page

‘మొసలి కూడా కేజ్రీవాల్‌ను చూసి చాలా నేర్చుకోవాలి’

Published Thu, Dec 3 2020 12:09 PM | Last Updated on Thu, Dec 3 2020 12:25 PM

Akali Dal Slams Arvind Kejriwal Over Farm Laws Implementation In Delhi - Sakshi

చండీఘర్‌: శిరోమణి అకాలీదల్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌‌ సింగ్‌ బాదల్‌ ఆప్‌ సర్కారుపై తీవ్ర స్థాయిలోమండిపడ్డారు. రైతు సమస్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. రైతుల నడ్డి విరిచేలా కేంద్రం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినా, రైతుల పక్షాన నిలవకుండా కేజ్రీవాల్‌ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వ చట్టాలను ఢిల్లీ అమలు చేస్తుండటం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ సైతం విడుదల చేసిన విషయాన్ని బాదల్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. (చదవండి: గ్యాస్‌ ఇన్‌ఫ్రాలోకి పెట్టుబడులు.)

మొసలి కూడా కేజ్రీవాల్‌ను చూసి చాలా నేర్చుకోవాలని, మొసలి కన్నీళ్లు సామెతకు పేరు మార్చి ‘కేజ్రీవాల్‌ కన్నీళ్లు’ అంటే సరిగ్గా ఉంటుందని బాదల్‌ ఎద్దేవా చేశారు. రైతులకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్న ఢిల్లీ సర్కారు తీరుతో కేజ్రీవాల్‌ మనస్తత్వం, ఆప్‌ వైఖరి ఏంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను తాము అమలు చేయబోమని చెప్పిన కేజ్రీవాల్‌ వాటికి అనుగుణంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు విడుదల చేశారని బాదల్‌ ప్రశ్నించారు. ఆయనకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే  ఆ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement