union budget 2021 increase agricultural budget credit - Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగానికి రూ. 1,31,531 కోట్లు

Published Tue, Feb 2 2021 8:50 AM | Last Updated on Tue, Feb 2 2021 11:05 AM

Agriculture Budget 2021: Increase Agricultural Credit - Sakshi

రైతు ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సోమవారం తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ బ్యాంకుల ద్వారా వ్యవసాయానికిచ్చే రుణాల పరిమితిని 10% పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు అయింది. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం పలు ఉత్పత్తులపై సెస్‌ విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సెస్‌ బంగారం, వెండిలపై 2.5% వరకూ ఉంటే.. మద్యంపై 100% వరకూ ఉంది. ఈ నిధులను మౌలిక సదుపా యాలను అభివృద్ధికి ఖర్చు చేస్తామని మంత్రి తెలిపారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి ఇచ్చే నిధులను గత ఏడాది (రూ.30వేల కోట్లు) కంటే రూ. పదివేల కోట్లు ఎక్కువ చేయడం, సూక్ష్మ బిందు సేద్యం, మార్కెట్‌ యార్డుల్లో సదుపాయాలు, అభివృద్ధి నిధుల సాయం అందించడం కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించిన హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.

న్యూఢిల్లీ: తొలిసారి తన డిజిటల్‌ బడ్జెట్‌ను పార్లమెం టులో ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి సీతారామన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాల న్నది దేశం మొదటి సంకల్పమని పేర్కొన్నారు. వ్యవ సాయ రుణ వితరణ లక్ష్యాన్ని  రూ.16.5 లక్షల కోట్లకు పెంచడంతోపాటు పశుపోషణ; డెయిరీ, చేపల పెంపకానికి కూడా తగినన్ని నిధులు రుణాల రూపంలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచడం వల్ల దిగుబడులు పెరుగుతాయని, పండించిన పంటలను కాపాడుకోవడంతోపాటు, సమర్థంగా ఉపయోగించుకోవచ్చునని ఈ చర్యలన్నింటి కారణంగా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కోసం సెస్‌ విధించే సమయంలో వినియోగదారులపై అదనపు భారం పడకుండా తగిన జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు.  

ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీమ్‌ విస్తరణ...
వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల విలువ, ఎగుమతులను పెంచేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీమ్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కేవలం టమాటాలు, బంగాళదుంప, ఉల్లిపాయలకు మాత్రమే వర్తిస్తూండగా.. మరో 22 ఉత్పత్తులు (త్వరగా నశించిపోయేవి)ను చేర్చనున్నారు. ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ–నామ్‌)లో ఇప్పటికే 1.68 కోట్ల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా రూ.1.14 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో వెయ్యి మండీలను ఈ–నామ్‌లకు చేరుస్తున్నట్లు ప్రకటించారు. సూక్ష్మబిందు సేద్యానికి ప్రస్తుతమిస్తున్న రూ.5000 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ఫిషరీస్‌ రంగం అభివృద్ధికి కోచీ, చెన్నై, విశాఖపట్నం, పరదీప్, పెటువాఘాట్‌లలోని ప్రధాన ఫిషింగ్‌ హార్బర్లను ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుస్తామని తెలిపారు. నదీతీరాల్లో, జలమార్గాల్లోనూ మత్స్య సంపద కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తమిళనాడులో సముద్రపు నాచు పెంపకానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

వలస కార్మికుల కోసం...
దేశంలో ఎక్కడైనా రేషన్‌ సరుకులు పొందేందుకు వీలు కల్పించే వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ పథకం వల్ల 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 86 శాతం మంది లబ్ధిదారులు లాభం పొందారని కేంద్ర మంత్రి వివరించారు. అసంఘటిత రంగంలోని కార్మికులు మరీ ముఖ్యంగా వలస కార్మికుల సమాచారం సేకరించేందుకు, తద్వారా వారి కోసం పథకాలను రూపొందిం చేందుకు ఒక పోర్టల్‌ను రూపొందించనున్నామని మంత్రి తెలిపారు. సామాజిక భద్రత పథకాలను గిగ్, ప్లాట్‌ఫార్మ్‌ కార్మికులకూ వర్తింపచేసేందుకు, ఈఎస్‌ఐ సేవలు అన్ని వర్గాల కార్మికులకు అందేలా చేసేందుకు కనీస వేతనాల్లో మార్పులు చేస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అన్ని రంగాల్లోనూ మహిళలు తగిన రక్షణతో రాత్రి షిఫ్ట్‌లు పనిచేసేందుకు వీలుగా కూడా చట్టాల్లో మార్పులు తేనున్నట్లు చెప్పారు. స్టాండప్‌ ఇండియా పథకంలో ఎస్సీఎస్టీ మహిళలకు మార్జిన్‌ మనీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

మద్దతు ధర వితరణ పెరిగింది...
పంటల ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఇచ్చేందుకు తగిన మార్పులు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. పంట దిగుబడుల సేకరణ క్రమేపీ పెరుగుతున్న కారణంగా మద్దతు ధర వితరణ కూడా ఎక్కువైందని, 2013 –14తో పోలిస్తే వరి, గోధుమ, పప్పుధాన్యాలు, పత్తి పంటల కోసం రైతులకు ఇచ్చిన మొత్తం పెరిగిందని (బాక్స్‌ చూడండి) వివరించారు. గోధుమల సేకరణ వల్ల 2020–21లో 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా గత ఏడాది ఈ సంఖ్య 35.57 కోట్లేనని వివరించారు. పప్పుధాన్యాల సేకరణ 2013–14 కంటే నలభై రెట్లు పెరిగి 2019–20 నాటికి రూ.10,530 కోట్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. 

సెస్‌ విధింపు.. సుంకాల తగ్గింపు..
వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం కొన్ని ఉత్పత్తులపై సెస్‌ విధించిన ప్రభుత్వం కొన్నింటి సుంకాలను తగ్గించింది. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ వసూలు చేయనున్నప్పటికీ సుంకాల తగ్గింపు కారణంగా ఆ ప్రభావం వినియోగదారులపై పడకపోవచ్చు. ఈ రెండు ఉత్పత్తులపై విధించే ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకం, స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించింది. వరి, గోధుమల సేకరణ కోసం పెట్టిన ఖర్చు ఎక్కువైన మాట నిజమే. కానీ ప్రభుత్వం సేకరించే మిగిలిన 20 పంటల పరిస్థితి ఏమిటి? అంతకంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే.. పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ వంటి కొన్ని రాష్ట్రాల నుంచే బియ్యం సేక రణ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రుణ వితరణ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రూ.16.5 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం పెట్టుకున్నా ఈ మొత్తం అన్ని రాష్ట్రాలకు సమంగా పంపిణీ కాదు. రాష్ట్రాల్లోని రైతులకు కూడా సమానంగా ఇవ్వరు.

కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తం పంపిణీ అవుతుంది. పెద్ద పెద్ద రైతులు లబ్ధి పొందుతూంటారు. వడ్డీ సబ్సిడీల లాభం కూడా వీరికే దక్కుతుం టుంది. వ్యవసాయం చేయని భూస్వాములు తక్కువ వడ్డీతో వచ్చే రుణాలను అనుభవిస్తూంటే అసలు రైతుకు సంస్థాగత రుణాల లభ్యత ఉండటం లేదు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో హెక్టారుకు రూ.30,000 వరకూ సబ్సిడీలు లభిస్తూంటే కొన్ని రాష్ట్రాల్లో ఇది మూడు వేలకు మించడం లేదు. ఈ అసమానతలను సరిదిద్దగకపోతే, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా, ఒడిశాలోని కాలియా, పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రభావం గురించి ఆర్థిక సర్వేలో ప్రస్తావించి నప్పటికీ బడ్జెట్‌లో మాత్రం ప్రత్యక్ష నగదు బదిలీ ఊసు లేనేలేకపోవడం గమనార్హం. జి.వి.రామాంజినేయులు, సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్, హైదరాబాద్‌.

5.6%పెరుగుదల
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు గత ఏడాది కంటే 5.6 శాతం ఎక్కువ నిధులు లభించగా ఇందులో సగం మొత్తాన్ని ప్రధానమంత్రి కిసాన్‌ కార్యక్రమానికి ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2021–22 సంవత్సరానికి గాను మొత్తం రూ.1,31,531 కోట్లు కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, సాగునీటి పథకాలకు గత ఏడాది కంటే స్వల్పంగా ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చాయి. 2020–21 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.1,24,519 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా కేటాయింపుల్లో రూ.1,23,017.57 కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉపయోగించు కుంటుంది. మిగిలిన రూ.8,513 కోట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ కోసం వినియోగిస్తారు. పీఎం–కిసాన్‌ కార్యక్రమానికి రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తారు.  

మద్దతు ధర వితరణ  (రూ. కోట్లలో)

ఉత్పత్తి 2013–14 2019–20 2020–21
 గోధుమలు 33,874 62,802 75,050
బియ్యం 63,928 1,41,930 172,752
పప్పుధాన్యాలు 236 8,285 10,530
పత్తి 90 -  25,974

వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సెస్‌ దేనిపై ఎంతంటే(శాతాల్లో)

శనగపప్పు 50 శాతం
ఆపిల్‌ పండ్లు 35 శాతం
కాబూలీ శనగలు 30 శాతం
మసూర్‌దాల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్ 20 శాతం
ముడి పామాయిల్ 17.5 శాతం
బటానీలు 10 శాతం
పత్తి, నిర్దిష్ట ఎరువులు 5 శాతం
బంగారం, వెండి కడ్డీలు 2.5 శాతం
బొగ్గు,పీట్‌ లిగ్నైట్ 1.5 శాతం
పెట్రోలు రూ.2.5
డీజిల్ రూ.4.0

రైతులతో చర్చలకు సిద్ధం: నిర్మలా
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని ఆమె చెప్పారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఎందుకు బైఠాయించారో మాకు అర్థమయింది. రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పలు పర్యాయాలు రైతులతో చర్చలు జరిపారు. కొత్త సాగు చట్టాలపై అంశాల వారీగా సూచనలు ఇవ్వాలని వారిని కోరారు. చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ఇదే విషయం స్పష్టం చేశారు’అని మంత్రి నిర్మల అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి అనుమానాలు, సందిగ్ధాలను తొలగించుకోవాలని ఆమె రైతులను కోరారు. అనంతరం, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్‌ చౌధరి మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఈ విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’అని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement