ఇలా జరుగుతుందని మావాడికి ముందే చెప్పాం: దీప్కే తల్లిదండ్రులు | Abhijeet Dipke's Parents On CJP Stir Crackdown | Sakshi
Sakshi News home page

ఇలా జరుగుతుందని మావాడికి ముందే చెప్పాం: దీప్కే తల్లిదండ్రులు

Oct 10 2026 7:16 PM | Updated on Oct 10 2026 8:12 PM

Abhijeet Dipke's Parents On CJP Stir Crackdown

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సహా పలువురు పార్టీ నాయకులను ఢిల్లీ విమానాశ్రయంలో విమానం నుంచే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులు, యువ సామాజిక కార్యకర్తల నిరసనలను అడ్డుకునేందుకు దేశ రాజధానిలో భారీగా పోలీసు బలగాలను మోహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడిన అభిజీత్ తండ్రి భగవాన్ దీప్కే.. ఢిల్లీలో ఇంతటి భద్రతా ఏర్పాట్లు ఎందుకని ప్రశ్నించారు. విద్యార్థులు, యువ కార్యకర్తలను తీవ్ర భద్రతా ముప్పుగా పరిగణించడం ఏమిటని నిలదీశారు. ‘‘ఢిల్లీలో ఇంతమంది పోలీసులను ఎందుకు మోహరించారో నాకు అర్థం కావడం లేదు. ఇది విద్యార్థుల ఆందోళన మాత్రమే. చంబల్ నుంచి బందిపోట్లు ఢిల్లీకి వచ్చారా? బందిపోట్లు పార్లమెంటులో కూర్చున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజల పౌర హక్కుల్లో భాగమని ఆయన పేర్కొన్నారు. నిరసనకు అధికారిక అనుమతులు లేవన్న వాదనలపై స్పందిస్తూ.. ప్రభుత్వ సంస్థలను ప్రశ్నించడం, వాటి నుంచి జవాబుదారీతనాన్ని కోరడం ప్రజలకు సహజమని అభిప్రాయపడ్డారు. ప్రజా శాంతిని కాపాడటంతో పాటు పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగపరమైన వ్యవస్థల్లో చోటు ఉందని పేర్కొన్నారు.

దీప్కే అరెస్టుపై ముందే భయపడ్డా: అనిత
అభిజీత్ తల్లి అనితా దీప్కే కూడా పోలీసుల చర్యలను ప్రశ్నించారు. తన కుమారుడి భద్రతపై ముందునుంచే భయపడినట్లు అనిత తెలిపారు. ‘‘ఇలా జరుగుతుందని నేను అతడికి ముందే చెప్పాను’’ అనే భావనతో ఆమె తన ఆందోళనను వ్యక్తం చేశారు. కుమారుడికి ఏమవుతుందోనన్న భయంతో నిద్రలేని రాత్రులు గడిపినట్లు వివరించారు.

విమానంలోకి వెళ్లి మరీ పార్టీ నాయకులను అడ్డుకున్నారన్న సమాచారం నేపథ్యంలో.. హింసకు పాల్పడని విద్యార్థి నాయకులపై ఇంత తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. సాధారణంగా తీవ్రమైన నేరాల విషయంలో అనుసరించే పోలీసు చర్యలతో పోలిస్తే, నిరసనకారులను అడ్డుకునేందుకు వేగంగా భారీ బలగాలను మోహరించడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

తమ కుమారుడి పౌర కార్యకలాపాలకు కుటుంబం మద్దతుగా ఉంటుందని స్పష్టం చేస్తూ, శాంతియుత నిరసనలను భద్రతా ముప్పులతో సమానంగా చూడవద్దని అధికారులను కోరారు. మరోవైపు, ట్రాఫిక్ స్తంభించకుండా చూడటం, కీలక ప్రభుత్వ భవనాలకు రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను కాపాడటం కోసం కఠిన చర్యలు అవసరమని అధికారులు చెబుతున్నారు. ‘‘అభిజీత్ దీప్కే అరెస్టుపై ముందే భయపడ్డా.. నిద్ర కూడా పట్టలేదు’’ అని అనిత అన్నారు.

ఇదీ చదవండి: అందుకే జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు: నితిన్‌ నబీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement