ఆ అరుపులు నా చెవిలో మార్మోగుతున్నాయి

4 Of Family Stuck Under Mud 3 Assassinated And One Survived - Sakshi

ముంబై : ‘‘ నా కళ్ల ముందే నా కుటుంబసభ్యులు చనిపోతున్నా.. వాళ్లను రక్షించుకోవటానికి ఏమీ చేయలేకపోయా’’ అంటూ శనివారం నాటి కాళరాత్రి పరిస్థితి తల్చుకుని కుమిలిపోయాడు ఆటో డ్రైవర్‌ అక్షయ్‌ జిముర్‌. భారీ వర్షాల కారణంగా ముంబైలోని చెంబూర్‌ వాషినాకా న్యూ భరత్‌నగర్‌లోని వంజార్‌ దాండా పరిసరాల్లో కొండ కింద ఉన్న ప్రహరీపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గోడ కూలి ఇళ్లపై పడింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది మృతి చెందారు. మృతుల్లో అక్షయ్‌ కుటుంబం కూడా ఉంది. తల్లిదండ్రులు సూర్యకాంత్‌, మీనా.. అక్క ఆపేక్ష శిథిలాల కింద నలిగి కన్నుమూశారు. అక్షయ్‌ మాత్రం గాయాలతో బయటపడ్డాడు.

అక్షయ్‌ అమ్మ, అక్క
శనివారం రాత్రి జరిగిన ఘటనను అతడు గుర్తు చేసుకుంటూ.. ‘‘ నేను మానాన్న ఇద్దరం ఆటో నడుపుతాము. రాత్రి ఎనిమిది గంటలకు నేను  ఇంటికి తిరిగి వచ్చాను.  అప్పుడు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అందరం భోజనం చేసి నిద్రపోవటానికి ఉపక్రమించాము.  మా ఇంటి మీద ఉన్న రెండు ఇళ్లు కుప్పకూలి మా ఇంటి మీద పడ్డాయి. మా ఇళ్లు కూడా కుప్పకూలింది. అయితే ఏం జరుగుతోందో కొన్ని క్షణాలు మాకు అర్థం కాలేదు. అర్థం అయ్యేలోపే అంతా జరిగిపోయింది. నేను శిథిలాలనుంచి బయటపడేసరికి రాత్రి 12.15 అయింది. అమ్మానాన్న, అక్క ఇరుక్కుపోయారు.  అంతా బురద, చీకటి.. ఓ కరెంట్‌ తీగ తెగి మా ఇంటి మీద పడింది. కొద్దిసేపటి తర్వాత మా పొరిగింటి వాళ్లు అక్కడికి వచ్చారు. నేను ఇంట్లోకి వెళదామనుకున్న ప్రతీ సారి కరెంట్‌ షాక్‌ తగిలింది.

అక్కడికి వచ్చినవాళ్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ వాళ్లుకు ఫోన్‌ చేశారు. వారినుంచి స్పందన లేదు. మా అమ్మానాన్న, అక్క సహాయం కోసం అరస్తూ ఉన్నారు. కానీ, నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఆ అరుపులు నా చెవిలో మార్మోగుతున్నాయి. తెల్లవారుజామున 3.30కు ఫైర్‌ సిబ్బంది వచ్చారు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు సమయానికి స్పందించి ఉంటే నేను నా కుటుంబాన్ని రక్షించుకుని ఉండేవాడ్ని. ఉదయం 5-6 గంటల ప్రాంతంలో వారి మృతుదేహాలను బయటకు తీశారు’’ అంటూ తన కన్నీటి కథను చెప్పుకొచ్చాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top