విలయం మిగిల్చిన విషాదం

26 bodies recovered 171 missing In Uttarakhand glacier burst - Sakshi

‘తపోవన్‌–విష్ణుగఢ్‌’సొరంగంలో చిక్కుకుపోయిన 35 మంది కార్మికులు

ఉత్తరాఖండ్‌ జల ప్రళయ కారణాలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు

26 మృతదేహాలు లభ్యం..  ఇంకా 171 మంది గల్లంతు

డెహ్రాడూన్‌/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ జల విలయానికి సంబంధించి ఇప్పటివరకు 26 మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో 171 మంది ఆచూకీ కోసం సహాయ దళాలు కృషి చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన 30 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మరోవైపు, ఈ విలయానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చమోలీ జిల్లా, జోషిమఠ్‌ దగ్గర్లోని నందాదేవి హిమనీనదం వద్ద అనూహ్యంగా భారీ ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తిందని, దాంతో ఈ జల ప్రళయం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నదీమార్గంలోని పర్వతం పై నుంచి లక్షలాది మెట్రిక్‌ టన్నుల మంచు ఒక్కసారిగా, వేగంగా కిందకు విరుచుకుపడడంతో ఈ జల ప్రళయం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సోమవారం తెలిపారు.

అంతకుముందు, ఆయన ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలు తనకు చూపించిన చిత్రాల్లో.. వరద ఉధృతి ప్రారంభమైన చోట హిమనీనదం ఏదీ కనిపించలేదని, మంచు అంతా కిందకు జారిపడిపోయిన ఒక పర్వతం మాత్రం ఉందని తెలిపారు. ఆ పర్వత శిఖరంపై నుంచే పెద్ద ఎత్తున మంచు కిందకు జారిపడి ఉంటుందని, దాంతో ధౌలి గంగ, రిషి గంగ నదులకు మెరుపు వరదలు వచ్చాయని భావిస్తున్నామని వివరించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష, పరోక్ష కారణాలను గుర్తించిన తరువాత, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని వివరించారు. అభివృద్ధి నిరోధక కధనాలకు అవకాశంగా ఈ దుర్ఘటనను తీసుకోవద్దని సూచించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా రాష్ట్రంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తామని సోమవారం తనను కలిసిన ఉత్తరాఖండ్‌ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. చదవండి: (తెలిసే వచ్చిన జలవిలయం ఇది)

ముమ్మరంగా సహాయ చర్యలు
వరదల్లో చిక్కుకుపోయి, ఇంకా ఆచూకీ లభించని సుమారు 170 మందిలో జల విద్యుత్‌కేంద్రంలో పనిచేస్తున్నవారు, నదీ తీరం వెంట ఇళ్లు కొట్టుకుపోవడంతో గల్లంతైన వారు ఉన్నారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌ వెల్లడించింది. 480 మెగావాట్‌ సామర్ధ్యమున్న, ఎన్టీపీసీకి చెందిన తపోవన్‌–విష్ణుగఢ్‌ విద్యుత్‌ కేంద్రం, 13.2 మెగావాట్ల సామర్ధ్యమున్న రిషి గంగ జల విద్యుత్‌ కేంద్రం తాజా వరదలతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ.. పదుల సంఖ్యలో కార్మికులు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో చిక్కుకుపోయారు. దాదాపు 13 గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో ఆర్మీ, ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టాయి. ఆర్మీ మెడికల్‌ కార్ప్స్, వైమానిక దళ బృందాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. చదవండి: (స్వయంకృతం)

తపోవన్‌– విష్ణుగఢ్‌ విద్యుత్‌ కేంద్రం టన్నెల్‌లో చిక్కుకుపోయిన సుమారు 35 మందిని రక్షించేందుకు సహాయ బృందాలు కృషి చేస్తున్నాయి. పెద్ద ఎత్తున బుల్‌డోజర్లు, జేసీబీలు ఇతర యంత్ర సామగ్రిని అక్కడికి తరలించారు. 250 మీటర్ల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ సొరంగ మార్గం కొద్దిగా వంపు తిరిగి ఉన్న కారణంగా సహాయ చర్యలకు సమయం పడుతోందని రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. సొరంగంలోపల పెద్ద ఎత్తున బురద పేరుకుపోయిందని, ఇప్పటివరకు సుమారు 100 మీటర్ల మేర బురదను తొలగించగలిగామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌కుమార్‌ పాండే వెల్లడించారు. సుమారు 300 మంది ఐటీబీపీ సిబ్బంది ఈ విధుల్లోనే ఉన్నారన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన అందరినీ రక్షించగలమనే ఆశిస్తున్నామన్నారు. అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. ఈ వరదల్లో విద్యుత్‌ కేంద్రాల సిబ్బందిలో 202 మంది గల్లంతయ్యారని, వారు ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల వారని పాండే వివరించారు. ఈ విద్యుత్‌ ప్రాజెక్టుల సూపర్‌వైజర్లు కూడా గల్లంతు కావడంతో ఉద్యోగులు/కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారం లభించడం లేదన్నారు.

మరో చిన్న సొరంగంలో..
తపోవన్‌– విష్ణుగఢ్‌ కేంద్రానికి సంబంధించిన మరో చిన్న సొరంగంలో చిక్కుకుపోయిన 12 మందిని, రిషిగంగ కేంద్రం వద్ద వరదల్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించగలిగామని తెలిపారు. ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన స్నిఫర్‌ డాగ్స్‌ను కూడా సహాయ చర్యల్లో పాలు పంచుకునేందుకు రంగంలోకి దింపారు. ఈ సొరంగానికి ఒకవైపే మార్గం ఉందని విద్యుత్‌ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. సోమవారం మరిన్ని బలగాలను జోషిమఠ్‌కు పంపించామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. వరద ఉధృతికి మేటవేసిన బురదతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. పలు నిర్మాణాలు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయాయి.

కచ్చితమైన కారణమేంటి?
ఈ దుర్ఘటనకు కచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలు ఇప్పటికే చమోలీ చేరుకున్నాయి. డీఆర్‌డీవోలోని ‘ద స్నో అండ్‌ అవలాంచీ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌’సభ్యులు రంగంలోకి దిగారు. వాతావరణ మార్పు, లేదా ఆకస్మిక శీతాకాల వర్షాలు ఈ విలయానికి కారణం కావచ్చని నిపుణులంటున్నారు. హిమనీనద సరస్సు ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల కానీ, మంచు చరియలు విరిగి నదీ మార్గాన్ని అడ్డుకుని, ఆ తరువాత ఒక్కసారిగా ఆ మార్గం తెరుచుకోవడంతో కింది ప్రాంతాలకు విరుచుకుపడిన వరద వల్ల కానీ ఈ జల ప్రళయం చోటు చేసుకుని ఉండవచ్చని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top