జార్ఖండ్, మిజోరంలలోని మూడు సీట్లకు 18న పోలింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖేరా, బీజేపీ నేతలు సతీశ్ పునియా, తరుణ్ చుగ్ సహా 24 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నామినేషన్ల పరిశీలన ముగియగా, ఈ స్థానాలకు బరిలో ఒక్కొక్కరు మాత్రమే బరిలో ఉండటంతో వీరు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇందులో ఎన్డీయేకి 19 దక్కగా, ఐదు సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు.
విజేతలకు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కాగా, తీవ్రమైన పోటీ నెలకొన్న జార్ఖండ్‌లోని రెండు స్థానాలు, మిజోరంలోని ఒక స్థానానికి ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, పవన్ ఖేరాతోపాటు బీజేపీ నేత ఎం.నాగరాజా గెలిచారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ అక్కడ మూడు సీట్లలో బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్. రజనీశ్ అగర్వాల్, మహేశ్ కేవత్ గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గుజరాత్‌లో బీజేపీకి చెందిన రాజుభాయ్ శుక్లా, మాన్‌సిన్హ్ పర్మార్, ముకేశ్ భాయ్ రథ్వా, జితేంద్ర కంజారియా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి చెందిన బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీశ్ బాబు, జనసేనకు చెందిన లింగమనేని రమేశ్ గెలిచారు.
రాజస్తాన్‌లో బీజేపీకి చెందిన అల్కా గుర్జార్, సతీశ్ పునియా, కాంగ్రెస్ అభ్యర్థి నీరజ్ దాండి, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నేత జేమ్స్ కె.సంగ్మా, మణిపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారిమయుమ్ శారదా దేవి విజేతలుగా నిలిచారు. అదేవిధంగా, అరుణాచల్‌లో బీజేపీ నేత టాయ్ తగక్, మహారాష్ట్రలో ఎన్‌సీపీ నేత రాజేంద్ర జైన్, ఒడిశాలో బీజేపీ నుంచి దేబాశీష్ సామంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవ విజయం సాధించారు.


