మీనాక్షికి అగ్ని పరీక్ష  | Madhya Pradesh Rajya Sabha Race Intensifies As BJP Eyes Third Seat | Sakshi
Sakshi News home page

మీనాక్షికి అగ్ని పరీక్ష 

Jun 9 2026 5:33 AM | Updated on Jun 9 2026 5:33 AM

Madhya Pradesh Rajya Sabha Race Intensifies As BJP Eyes Third Seat

మధ్యప్రదేశ్‌లో మూడో అభ్యర్థిని బరిలో దింపిన బీజేపీ 

అవసరమైన 10 ఓట్ల కోసం కాంగ్రెస్‌ అసంతృప్తుల వైపు చూపు 

ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించే యోచనలో కాంగ్రెస్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. మూడో సీటు కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌పై బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో, తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, తమకు అవసరమైన 10 అదనపు ఓట్లను సమీకరించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. 

రెండు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, మూడో సీటుపై కన్నేసింది. ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ‘మూడో సీటూ మాదే. ఇంకెక్కడికి వెళ్తుంది?’ అంటూ ఆదివారం చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మత్స్యకార నేత మహేష్‌ కేవత్‌ను ఆదివారం రాత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అసెంబ్లీలో మొత్తం 230 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో 228 మంది ఎమ్మెల్యేలున్నారు. 

ఒక్కో రాజ్యసభ స్థానం గెలుపునకు 58 ఓట్లు కాగా బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన రెండు సీట్లు గెలిచిన తర్వాత మిగిలే ఓట్లు 48. మూడో సీటు కూడా దక్కాలంటే మరో పది ఓట్లుంటే సరిపోతుంది. కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉండటంతో 63కు ఆ సంఖ్య తగ్గొచ్చు. ఇది గెలుపు కోటా కంటే 6 ఓట్లు మాత్రమే ఎక్కువ. ఈ నేపథ్యంలో క్రాస్‌ ఓటింగ్, అసంతృప్తి ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. 

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను తెలంగాణ లేదా కర్ణాటకకు తరలించే ఆలోచనలో ఉంది. మీనాక్షీ నటరాజన్‌ తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం అధ్యక్షతన బీజేపీ నేతలు సమావేశమై కాంగ్రెస్‌లోని అసంతృప్తి వర్గాలను ఆకర్షించే వ్యూహాన్ని ఖరారు చేశారు. గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ పార్టీలో అంతర్గత అసమ్మతిని బయటపెట్టడమే బీజేపీ లక్ష్యమని అంటున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement