విమాన ప్రమాదం : 17 మంది దుర్మరణం

14 dead 123 injured in Kozhikode plane crash incident - Sakshi

తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 123 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ప్రమాద వివరాలను వెల్లడించింది. మృతుల్లో పైలెట్‌తో పాటు ఆరుగురు సిబ్బంది, ప్రయాణికులు ఉన్నారని, వారి వివరాలను కాసేపట్లో వెల్లడిస్తామని తెలిపింది. విమానం తీవ్రంగా దెబ్బతినడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా విమాన ప్రమాదంపై యావత్‌ దేశ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. (ఎయిరిండియా విమానానికి ప్రమాదం)

విమాన ప్రమాదంపై మోదీ ఆరా
కోజికోడ్‌ విమాన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎయిర్‌ ఇండియా అధికారులకు సైతం ఫోన్‌ చేసి ప్రమాద ఘటన గురించి చర్చించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను మరింత ముమ్మరం చేయాలని స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించారు. విమాన ప్ర‌మాదం బాధ‌కు గురిచేసింద‌ని ప్ర‌ధాని విచారం వ్యక్తం చేశారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లంలోనే ఉన్న‌ట్లు బాధితుల‌కు కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు, ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు  పేర్కొన్నారు.

విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. కోజికోడ్‌లో జ‌రిగిన‌ ఎయిర్ ఇండియా  విమాన ప్ర‌మాద ఘ‌ట‌న విచార‌క‌ర‌మ‌న్నారు. ప్రమాదం గురించి తెలిసి బాధ‌కు గురైన‌ట్లు తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా అమిత్‌ షా ఆదేశించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top