అమెరికాలో అయ్యో పాపం మన పిల్లలు... | Sakshi
Sakshi News home page

అమెరికాలో అయ్యో పాపం మన పిల్లలు...

Published Tue, Sep 5 2023 6:38 AM

1. 4 lakh Indians in US risk being separated from parents - Sakshi

న్యూఢిల్లీ: అమెరికాలో ఉంటున్న భారతీయులకు మరో చేదు వార్త. వారి పిల్లల్లో చాలామంది 21 ఏళ్లు నిడగానే దేశం వీడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరి హెచ్‌4 కేటగిరీ వీసాల ప్రాసెసింగ్‌కు దశాబ్దాలకు పైగా వెయిటింగ్‌ జాబితా ఉండటమే ఇందుకు కారణం. వీరి సంఖ్య లక్షకు పైగా ఉంటుందన్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌ కార్డుల కోసం ఉద్యోగాధారిత కేటగిరీ కింద దరఖాస్తు చేసుకుని వెయిటింగ్‌ లో ఉన్న భారతీయుల సంఖ్య 10.7 లక్షలకు పైగా ఉంది. ఇది చాలదన్నట్టు ఒక్కో దేశం నుంచి ఏటా ప్రాసెస్‌ చేసే వీసా దరఖాస్తుల సంఖ్యను 7 శాతానికి పరిమితం చేయడం సమస్యను జటిలం చేసింది. ప్రస్తుత వేగంతో మన వాళ్లందరికీ గ్రీన్‌ కార్డులు రావాలంటే హీన పక్షం 135 ఏళ్లు పడుతుంది.

21 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించేదే హెచ్‌4 వీసా. ఈ కారణంగా కనీసం 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుందని డిసైడ్‌ మెయిర్‌ అనే ఇమిగ్రేషన్‌ వ్యవహారాల నిపుణుడు చేసిన అధ్యయనంలో తేలింది. హెచ్‌ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్‌4 వీసా ఇస్తారు.

21 ఏళ్లు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత వాళ్లు హెచ్‌4 కేటగిరీ కింద అక్కడ ఉండేందుకు వీల్లేదు. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్‌ (ఎఫ్‌) వీసా సంపాదించాలి. అవి చాల పరిమిత సంఖ్యలో మాత్రమే దొరుకుతాయి. దొరకని వారంతా అమెరికా వీడాల్సి ఉంటుంది. పిల్లలుగా అమెరికా వెళ్లి, అక్కడే పెరిగి పెద్దయిన వారికి ఇలా తల్లిదండ్రులను వదిలి దేశం వీడటం నరకప్రాయమే. పైగా భారత్‌ లోని తమ కుటుంబాలతో వారికి పెద్ద బంధాలేవీ ఉండే అవకాశం పెద్దగా ఉండదు. కనుక వెనక్కు వచ్చి ఇక్కడ, ఎలా ఉండాలన్నది మరో పెద్ద సమస్య కాగలదు.

Advertisement
 
Advertisement