పేట మార్కెట్‌కు ధాన్యకళ | - | Sakshi
Sakshi News home page

పేట మార్కెట్‌కు ధాన్యకళ

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

నారాయణపేట: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించి అప్పులు తీర్చుకోవాలన్న రైతుల ఆశలకు మార్కెట్‌యార్డులో ఎదురుచూపులే మిగులుతున్నాయి. పంట చేతికొచ్చిందన్న ఆనందంతో ధాన్యాన్ని బస్తాల్లో నింపి యార్డుకు తరలిస్తే అక్కడ అడుగడుగునా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయి. రోజుకు వేలాది బస్తాల ధాన్యం వస్తుండగా.. వాటిని కొనుగోలు చేసి లారీల్లో తరలించే ప్రక్రియ మాత్రం నెమ్మదిస్తోంది. ఫలితంగా నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డు ధాన్యం రాశులతో కిటకిటలాడుతోంది. రోజుకు సుమారు 30 వేల బస్తాల రాకతో స్థలభావం ఏర్పడటమే కాకుండా క్రయవిక్రయాలు సైతం రోజు విడిచి రోజు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వచ్చిన ధాన్యాన్ని గురువారం లారీల్లో తరలిస్తుండగా.. శుక్రవారం తిరిగి కొనుగోలు చేపట్టారు. దీంతో రైతులు తమవంతు కోసం వేచి చూడాల్సి వస్తోంది. సకాలంలో చేతికి డబ్బులు అందకపోవడంతో తదుపరి పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాలు, అప్పుల చెల్లింపులపై అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం రాకకు అనుగుణంగా కొనుగోళ్లు, రవాణా ఏర్పాట్లు చేయకపోతే రైతుల ఇబ్బందులు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.

సన్నరకాలకే ధర..

నారాయణపేట మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి ఒక దశలో క్వింటా రూ.4 వేలకుపైగా పలికినా.. తాజాగా తగ్గుముఖం పట్టాయి. 18వ తేదీన ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.4,036 పలకగా, 27న రూ.3,713కు చేరింది. మరోవైపు కేఎన్‌ఎం రకం ధర 16న రూ.3,630 పలకగా, 27 నాటికి రూ.2,732కు చేరింది. దొడ్డురకం ధాన్యం మాత్రం రూ.2,100 నుంచి రూ.2,400 మధ్యే ధరలు నమోదవుతున్నాయి.

తగ్గుతున్న

కంది ధర..

ప్రారంభంలో క్వింటా రూ.11 వేలకుపైగా పలికిన కంది ధరలు తాజాగా తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌కు ఓ వైపు వరి ధాన్యం భారీగా చేరుతుండగా.. మరోవైపు ఎర్ర, తెల్ల కంది రాక కూడా పెరుగుతోంది. దీంతో యార్డులో రద్దీ మరింత అధికమవుతోంది. నవంబర్‌ 14న రూ.11,502 పలికిన తెల్లకంది ధర 27వ తేదీకి రూ.10,719కు చేరింది. ఎర్రకంది ధర సైతం 16న రూ.11,221 నుంచి 27న రూ.10,666కు తగ్గింది.

రోజుకు 30 వేల బస్తాల వరి రాక

నెమ్మదిస్తున్న కొనుగోళ్లు

లోడింగ్‌కు వ్యాపారుల అవస్థలు

సన్నరకం క్వింటా రూ.3,700 పైనే..

అన్నదాతల కళ్లల్లో ఆనందం

మంచి ధరలు వస్తుండటంతో..

రైతులు తీసుకొస్తున్న ధాన్యంతో మార్కెట్‌యార్డు నిండిపోతోంది. రోజు 15 వేల నుంచి 20 వేల బస్తాల వరకు ధాన్యం వస్తుంది. వారం రోజుల్లో రోజు విడిచి రోజు ధాన్యం విక్రయాలు జరిగాయి. మంచి ధరలు వస్తుండటంతో రైతులు మార్కెట్‌కు పెద్దఎత్తున ధాన్యం తీసుకొస్తున్నారు. – భారతి, మార్కెట్‌ కార్యదర్శి, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement