రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎస్పీ

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

నారాయణపేట: చలికాలంలో మంచు కమ్ముకొని రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. అప్రమత్తతే రక్షణనని ఎస్పీ డా. వినీత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రధాన రహదారులు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆటో, లారీ డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. చలికాలంలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కారణంగా రహదారులు స్పష్టంగా కనిపించవని, మలుపులు, రహదారి అంచులు గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు. వాహనదారులు వేగాన్ని నియంత్రించుకోవాలని, ముందు వెళ్తున్న వాహనానికి తగిన దూరం పాటించాలని సూచించారు. వాహనాల లైట్లు సక్రమంగా పనిచేస్తున్నాయో తనిఖీ చేసుకోవాలని, రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైనప్పుడు ఫాగ్‌ లైట్లు వినియోగించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారులో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడపడం, ట్రాఫిక్‌ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement