ఊట్కూర్: బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. అంతర్జాతీయ బాల్య వివాహాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని.. రాష్ట్రంలోనే బాల్య వివాహాల సమస్య ఎక్కువగా ఉన్న జిల్లా నారాయణపేట అని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 60 గ్రామపంచాయతీలు బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తీర్మానాలు ఇచ్చాయని చెప్పారు. బాల్య వివాహ సమస్య అనేది ఒక శాఖకు సంబంధించిన బాధ్యత కాదని.. ప్రతి ఒక్కరి సమస్య అని గుర్తుచేశారు. గ్రామాల్లో పురోహితులు, పండితులు, ఖాజీలు, పాస్టర్లు బాల్య వివాహాలు చేయమని స్పష్టమైన నిర్ణయం తీసుకొని సహకరించాలని కోరారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే హెల్లైన్ నంబర్ 1098కు సమాచారం అందించాలన్నారు. బాలికలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువుకోవాలని, గ్రామీణ ప్రాంతాలను నుంచి వచ్చిన బాలికలు సైతం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. బాల్య వివాహ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుక భరత్, రాజేందర్‌గౌడ్, ప్రత్యేక అధికారి శంకర్, ఎంపీడీఓ పావని, జెడ్పీటీసీ మాజీ సభ్యులు అరవింద్‌కుమార్, సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్క ర్, అధికారులు కరిష్మా, డా. సంతోషి, రషీద్ అహ్మ ద్, ఉప సర్పంచ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


