● డయల్ యువర్ ఎస్పీకి విశేష స్పందన
నారాయణపేట: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని సత్వర పరిష్కారం చూపడమే డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎస్పీ డా. జి.వినీత్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు జరిగిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 24 మంది ఫోన్ చేసి తమ సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు తెలియజేశారు. గ్రామీణ యువత మద్యానికి బానిసవుతున్నారని, బెల్ట్ దుకాణాలను పూర్తిగా మూసివేయాలని పలువురు కోరారు. అర్ధరాత్రి వరకు యువత రోడ్లపై తిరుగుతున్నారని, మద్యం దుకాణాల నుంచి బెల్టు దుకాణాలకు వాహనాల్లో మద్యం తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాత్రిళ్లు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, జిల్లాకేంద్రంలోని టపాసుల దుకాణాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని, వచ్చే ఏడాది కూడా ఇదే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. అంబేడ్కర్ చౌరస్తాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆటోస్టాండ్‌తో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగార్థులకు శారీరక దారుఢ్య శిక్షణ ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భూ తగాదాలు, సైబర్ నేరాల్లో నగదు కోల్పోయిన బాధితులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సమస్యను ఎస్పీ స్వయంగా నమోదు చేసుకొని సంబంధిత పోలీస్ అధికారులకు సిఫారస్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు న్యాయం చేయడమే పోలీస్‌శాఖ ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. పోలీస్‌శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, డీసీఆర్బీ ఎస్‌ఐ బాలరాజు, కమ్యూనికేషనన్ ఎస్‌ఐ పవన్ పాల్గొన్నారు.


