● మక్తల్ నియోజకవర్గంలో
కొత్తగా 4,085 మందికి పింఛన్లు
● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ
మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, కృష్ణా మండలాలకు చెందిన లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించి అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. మక్తల్ నియోజకవర్గంలో కొత్తగా 4,085 మందికి పింఛన్లు మంజూరు చేశామన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ప్రతినెలా రూ. 95.11 లక్షలు జమ చేయనున్నట్లు తెలిపారు. మరో 200 మందికి పింఛన్ల మంజూరు అంశం పరిశీలనలో ఉందని.. అర్హులకు పింఛన్ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 17వేల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్ రూపంలో రూ. 18కోట్ల ఆర్థికసాయం అందిస్తున్నట్లు వివరించారు. కొత్తగా పింఛన్ కోసం 12వేల దరఖాస్తులు అందగా.. తొలి దశలో 7,500 మందికి మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియో గం చేసుకోవాలని సూచించారు.


