మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో శుక్రవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా అండర్–17 బాల బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. హ్యాండ్‌బాల్ కోర్టు వద్ద సౌకర్యాలను తనిఖీ చేశారు.
పది ఉమ్మడి జిల్లాల జట్లు..
రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాలకు చెందిన బాల బాలికల జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 320 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్ హాజరుకానున్నారు. బాలికలకు మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో, బాలురకు హీరా మోడల్ స్కూల్‌లో వసతి కల్పించారు. క్రీడాకారులందరికీ మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.
రెండు మైదానాల్లో పోటీలు..
లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బాల, బాలికల విభాగాల్లో కలిపి సుమారు 46 మ్యాచ్‌లు జరగనున్నాయి. మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్, హీరా మోడల్ స్కూల్ మైదానాల్లో పోటీలు నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి టోర్నీని ప్రారంభించనున్నారు. ఈనెల 15న మధ్యాహ్నం 2 గంటలకు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. వీటికి డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
నేటినుంచి 70వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ
బరిలోకి దిగనున్న పది ఉమ్మడి జిల్లాల జట్లు
320 మంది క్రీడాకారులు.. 40 మంది అఫీషియల్స్ రాక


