నీటిఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నీటిఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

Nov 13 2026 4:23 AM | Updated on Nov 13 2026 4:23 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, పీఎంఏవైజీ, ఉపాధి కూలీల సమీకరణ, జలసిరి, స్వచ్చభారత్‌ మిషన్‌, కొత్త జాబ్‌కార్డుల నమోదు, చేయూత పింఛన్లు, తాగునీటి సరఫరా, పురపాలికల అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 45 నుండి 50 శాతం లోటు వర్షపాతం నమోదైందని, గతేడాదితో పోలిస్తే గణనీయమైన లోటు ఉందన్నారు. ముఖ్యంగా అక్టోబర్‌లో సాధారణం కంటే 96 శాతం లోటు వర్షపాతం నమోదవడం ఆందోళనకరమని తెలిపారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని.. ఎంపీడీఓలు, పుర కమిషనర్లు తాగునీటి సరఫరాపై పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే జలసిరి పనులకు సంబంధించి కొన్ని మండలాల్లో వారం రోజులుగా కొత్త పనుల ప్రారంభం, గ్రౌండింగ్‌, పూర్తిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్నారు. మరికల్‌, మద్దూర్‌, కోస్గి తదితర మండలాలకు మంజూరైన పనులను వేగవంతం చేయాలని, పీఎంఏవైజీ పోర్టల్‌లో అర్హులైన లబ్ధిదారుల జాబ్‌కార్డుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో రెండోదశ ఇందిరమ్మ ఇళ్ల ప్రతిపాదనలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. పింఛన్లు, స్వచ్ఛభారత్‌ మిషన్‌ పనులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుజాత, హౌసింగ్‌ పీడీ శంకర్‌నాయక్‌, మిషన్‌ భగీరథ ఈఈ శ్రీనివాస్‌, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement