నారాయణపేట: జిల్లాలో టపాసుల విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు, భద్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని.. సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ముందస్తు అనుమతులు, లైసెన్సులు పొందిన తర్వాతే విక్రయాలు ప్రారంభించాలని ఎస్పీ డా. వినీత్ బుధవారం తెలిపారు. పండుగ వేళ బాణసంచా విక్రయాల పేరుతో ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతకు ముప్పు కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా టపాసుల నిల్వలు ఉంచడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రతి పోలీస్‌స్టేషనన్ పరిధిలో బాణసంచా దుకాణాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దుకాణాల వద్ద అగ్నిమాపక యంత్రాలు, ఇసుక, నీటి బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ వైరింగ్‌లో తగిన జాగ్రత్తలు పాటించాలని, స్పష్టంగా కనిపించేలా నో స్మోకింగ్ బోర్డులు ప్రదర్శించాలని పేర్కొన్నారు. దుకాణాల్లో పొగతాగడం, అగ్గిపుల్లలు, లైటర్లు వినియోగించడం, వంట చేయడం, మంటలు ఉపయోగించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినా, అనుమతులు లేకుండా విక్రయాలు జరిపినా సంబంధిత యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీస్‌శాఖ ప్రధాన లక్ష్యమని.. పండుగ సమయంలో ఎలాంటి అగ్నిప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వ్యాపారులు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.


