జడ్చర్ల: ఆస్పత్రి నిర్మాణంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఆస్పత్రి నిర్మాణానికి రూ.25 కోట్ల డీడీ ఇవ్వాలన్న ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. అయితే ముందుగా ఆస్పత్రి స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయిస్తూ జీఓ ఇవ్వాలని కోరారు. జీఓ అందిన వెంటనే తన సతీమణి శ్వేత ఫౌండేషన్ ద్వారా రూ.25 కోట్లతో ఆస్పత్రి నిర్మిస్తామని స్పష్టం చేశారు. శనివారం అంబేద్కర్ కళాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను బ్రోకర్‌గా సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన లక్ష్మారెడ్డి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిని ఓడించేందుకు అనిరుధ్‌రెడ్డి తన మద్దతు కోరలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తనపై విమర్శలు చేయడం తగదన్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణంపై మాట్లాడుతూ.. క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణానికి అనుమతులు, నిబంధనలపై ప్రశ్నలు సంధించారు. ఫైరింజన్ తిరిగేందుకు కూడా అవకాశం లేని విధంగా నిర్మాణం జరుగుతోందని ఆరోపించారు. ఘన్‌సీమియా గూడ సమీపంలో కొనుగోలు చేసిన భూమికి తాను రూ.6 కోట్లు చెల్లించేందుకు సిద్ధమని, వచ్చే లాభాన్ని జడ్చర్ల అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు. తమ హయాంలోనే జడ్చర్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని పేర్కొంటూ, ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని వివరించాలని డిమాండ్ చేశారు. ఉదండాపూర్ ఆర్‌అండ్‌ఆర్, రహదారుల నిర్మాణంపైనా విమర్శలు చేశారు. సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సవాల్
జీఓ ఇస్తే శ్వేత ఫౌండేషన్ ద్వారా రూ.25 కోట్లతో నిర్మాణం
మల్లురవికి వ్యతిరేకంగా నా మద్దతు కోరింది నువ్వు కాదా?
ఆస్పత్రి, క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణాలపై విమర్శలు


