44 శాతం తక్కువ వర్షపాతం..
76 శాతం చెరువుల్లో తక్కువ నీరు..
జిల్లాలో 148 మత్స్య సహకార సంఘాలు..
నారాయణపేట: ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులతో చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో జిల్లాలో చేపపిల్లల పంపిణీపై ప్రభావం పడింది. నీటి లభ్యత ఆధారంగా చేపపిల్లలను విడుదల చేసేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 80–100 మి.మీ., 35–40 మి.మీ. పరిమాణాల్లో మొత్తం 187.44 లక్షల చేపపిల్లలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. చెరువులు, కుంటల్లో సరిపడా నీటినిల్వలు లేకపోవడంతో కేవలం 45.83 లక్షల చేపపిల్లల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. టెండర్ల ధరల ప్రకారం మొత్తం లక్ష్యం విలువ రూ.2.30 కోట్లు కాగా.. ప్రస్తుతం విడుదల చేస్తున్న చేపపిల్లల విలువ కేవలం రూ.82.72 లక్షలు మాత్రమే. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారులు చేపపిల్లల పంపిణీకి సన్నద్ధమవుతున్నారు. కలెక్టర్ ప్రియాంక అనుమతితో పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో మత్సబీజాలను వదిలేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
● జిల్లాలోని 638 చెరువుల్లో నీటి నిల్వల పరిస్థితిని పరిశీలించారు. నీటిపారుదలశాఖ నివేదికల ఆధారంగా 50 శాతం కంటే ఎక్కువ నీటినిల్వ ఉన్న 14 చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. చేప పిల్లల సరఫరాకు కర్ణాటకలోని యాద్గిర్‌లో ఉన్న కనకయ్య ఫిష్ సీడ్ ఫాం, వనపర్తి జిల్లా రేవల్లి ప్రాంతంలోని కేకే ఫిష్‌సీడ్ ఫాం టెండర్లు దక్కించుకున్నాయి. 35 మి.మీ. నుంచి 40 మి.మీ. చేప పిల్లలు లక్ష సరఫరాకు రూ.59 వేలకు ముందుకొచ్చారు. 80 మి.మీ. నుంచి 100 మి.మీ. సైజు చేప పిల్లల 1.89 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు చేపల ఉత్పత్తిదారులు టెండర్లు దక్కించుకున్నారు.
కోస్గి మండలం ఊర చెరువులో నీటి నిల్వను పరిశీలిస్తున్న
జిల్లా మత్స్యశాఖ అధికారి (ఫైల్)
వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మొత్తం 13 మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. అక్టోబర్ 27 నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 582.1 మి.మీ.లు కాగా.. 327.2 మి.మీ.లే కురిసింది. దీంతో 44 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
జిల్లాలో 770 చెరువులు ఉండగా.. 583 చెరువు ల్లో 25 శాతంలోపే నీటి నిల్వలున్నాయి. 50 శాతానికి మించి నీటినిల్వలు ఉన్నవి కేవలం 24 చెరువులే. వర్షాభావ పరిస్థితులతో నీటి నిల్వలు తగ్గుతుండటంతో రైతులు, మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. పంటలకు నీరు, చేపల పెంపకానికి ఆధారమైన చెరువుల్లో నీరు లేకపోతే రానున్న నెలల్లో జీవనోపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. 163 చెరువుల్లో 25–50 శాతం, 24 చెరువుల్లో మాత్రమే 50–75 శాతం నీరు ఉండగా.. వాటి శాతం 3.1గా నమోదైంది. 75–100 శాతం నీటి నిల్వలున్న చెరువులు, పారుతున్న చెరువులు జీరోగా ఉన్నట్లు ఇరిగేషన్ అధికారుల గణంకాలు చెబుతున్నాయి.
జిల్లాలోని 13 మండలాల్లో 148 మత్స్య సహకార సంఘాలు ఉండగా.. వాటిలో 11,039 మంది సభ్యులు ఉన్నారు. చేప పిల్లలు చెరువుల్లో వేసిన తర్వాత పెరిగేందుకు సుమారు 8 నెలల సమయం పడుతుంది. ఆలోగా చెరువులు ఎండిపోతే చేపల పెరుగుదల దెబ్బతినడంతో పాటు మత్స్యకారుల ఆదాయానికి గండిపడే ప్రమాదం ఉంది. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, వృత్తి కోసం చేసిన అప్పుల చెల్లింపులపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చెరువులు వెలవెల.. తగ్గిన చేపపిల్లల పంపిణీ
లక్ష్యంలో 24.45 శాతం
పంపిణీకి సన్నాహాలు
ఎల్‌నినో ఎఫెక్ట్..
మత్స్యకారుల ఆశలపై నీళ్లు
రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఆదేశాలతో
కదలిన యంత్రాంగం


