నారాయణపేట: యువత ఆరోగ్యకర అలవాట్లను పాటిస్తూ పొగాకు రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌ఓ డా. జయచంద్రమోహన్, పుర చైర్‌పర్సన్ కొండ శ్వేత కోరారు. బుధవారం సింగారం చౌరస్తా సమీపంలోని ద్వారకా పాఠశాలలో పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పొగాకు రహిత యువతతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలు, వాటి కారణంగా సంభవించే వ్యాధులు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పొగాకు వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ, సామాజిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వివరించారు. చిన్న వయసు నుంచే పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పొగాకు వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. లక్ష్మీకాంత్, ఎన్‌సీడీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ విజయ్‌కుమార్, ఎన్‌వీబీడీసీపీ కో–ఆర్డినేటర్ రాజన్న, ప్రిన్సిపాల్ రవీందర్‌గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


