జిల్లాల వారీగా ఇలా..
● ఉమ్మడి జిల్లాలో 63 మండలాలను
ప్రకటించిన ప్రభుత్వం
● 44 మండలాల్లో తీవ్రం..
19 చోట్ల మధ్యస్థ కరువు
● వర్షాభావం, నేలలో తగ్గిన తేమతో
పంటలకు ముప్పు
–8లో u
నారాయణపేట: ప్రస్తుత వానాకాలం సీజన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరులో 63 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 3ను విడుదల చేసింది. ఎల్‌నినో ప్రభావం, నైరుతి రుతుపవనాల సమయంలో నమోదైన వర్షపాత లోటు, పంటల కీలక ఎదుగుదల దశల్లో నెలకొన్న దీర్ఘకాలిక పొడి వాతావరణం, నేలలో తేమశాతం తగ్గిపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొన్నింటిని తీవ్ర, మరికొన్ని మధ్యస్థ ప్రభావిత మండలాలుగా గుర్తించింది. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కలిపి మొత్తం 63 కరువు మండలాలుగా ప్రకటించింది. ఇందులో 44 మండలాలు తీవ్ర కరువు ప్రభావిత, 19 మధ్యస్థ కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది.
నారాయణపేట జిల్లాలోని 13 మండలాలను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఇందులో నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద, మరికల్, కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి, మద్దూరు, మక్తల్, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ, నర్వ మండలాలు ఉన్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో కాలూరు తిమ్మన్దొడ్డి, ధరూరు, గద్వాల, ఇటిక్యాల, మల్దకల్, గట్టు, అయిజ, రాజోళి, వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్, ఎర్రవల్లి మండలాలు ఉన్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పదింటిని తీవ్ర కరువు మండలాలుగా గుర్తించారు. ఊర్కొండ, వెల్దండ, చారకొండ, వంగూరు, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, పెద్దకొత్తపల్లి, కోడేరు, మధ్యస్థంగా బిజినేపల్లి, కల్వకుర్తి, అచ్చంపేట మండలాలను ప్రకటించారు.
వనపర్తి జిల్లాలో 6 మండలాలను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో అమరచింత, పాన్‌గల్, కొత్తకోట, ఆత్మకూర్, వీపనగండ్ల, ఏదుల మండలాలు ఉన్నాయి. మధ్యస్థంగా పెద్దమందడి, ఖిల్లాఘనపూర్, గోపాల్పేట, వనపర్తి, పెబ్బేరు మండలాలను నిర్ధారించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో చిన్నచింతకుంట, కోయిలకొండ తీవ్ర కరువు మండలంగా గుర్తించగా.. మిగతా 11 మండలాలు మధ్యస్థ కరువు ప్రాంతాలుగా నిర్ధారించారు. ఇందులో గండేడ్, హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, మహబూబ్‌నగర్ అర్బన్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, కౌకుంట్ల ఉన్నాయి.


