నారాయణపేట: ప్రజల భద్రత, నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని డీఎస్పీ నల్లపు లింగయ్య పేర్కొన్నారు. ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున జిల్లాకేంద్రంలోని బీసీకాలనీలో డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్‌్‌సెర్చ్ నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు 50 మంది పోలీసు సిబ్బంది కాలనీలోని 180 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 41 వాహనాలను సీజ్ చేయగా.. అందులో ద్విచక్ర వాహనాలు 38, ఆటోలు మూడు ఉన్నాయి. ఈ సందర్భంగా కాలనీవాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై సమాచారం అందిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. పోలీసులు నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై కాలనీవాసులు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని.. మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. పోలీసులకు సహకరిస్తూ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాలనీల్లో దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించడంతో పాటు అందుకు పాల్పడిన వారిని గుర్తించడం సులభమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే హెల్ప్‌లైనన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సతీష్‌రెడ్డి, గాయత్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


