నారాయణపేట: ప్రయాణికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి 13 వినతులు వచ్చినట్లు నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ యాకయ్య తెలిపారు. బస్సుల సంఖ్య పెంపు, సమయాల మార్పు, బస్టాండ్లలో మౌలిక వసతులు, గ్రామాల వద్ద బస్సుల నిలుపుదల వంటి అంశాలపై ప్రయాణికులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. నారాయణపేట నుంచి యానగుందికి మధ్యాహ్నం రెండు అదనపు ట్రిప్పులు నడపాలని, నారాయణపేట నుంచి గత్పకు రాత్రి అదనపు ట్రిప్పు నడపాలని, అలాగే కానుకుర్తి, యానగుంది మీదుగా హైదరాబాద్‌కు బస్సు నడపాలని విజ్ఞప్తులు వచ్చినట్లు చెప్పారు. అలాగే మంతనన్‌గోడు మీదుగా కురుమూర్తికి బస్సు క్రమం తప్పకుండా నడపాలని కోరగా రెగ్యులర్‌గా నడిపిస్తామని సమాధానమిచ్చామన్నారు. కోటకొండకు అదనంగా రెండు ట్రిప్పులు నడపాలన్న వినతిపై పరిశీలిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ నుంచి ఉదయం 8.15 బయలుదేరే బస్సు సమయాన్ని 8.30 మార్చాలన్న వినతిని కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. మరికల్ బస్టాండ్‌లో రాత్రిళ్లు విద్యుద్ధీపాలుసరిగా వెలగడం లేదని, ప్రయాణికులు కూర్చునేందుకు సీట్లు తక్కువగా ఉన్నాయని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. విద్యుద్ధీపాల మరమ్మతులు పూర్తి చేశామని, త్వరలో సీట్ల సంఖ్య పెంచుతామని డీఎం తెలిపారు. నారాయణపేట బస్టాండ్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కోరగా పరిశీలిస్తామన్నారు. పెద్దజట్రం గేటు వద్ద బస్సులు నిలిపేలా సిబ్బందికి సూచనలు ఇస్తామని వివరించారు. ప్రయాణికుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ వెల్లడించారు.
నేడు దివ్యాంగుల
బస్‌పాస్ మేళా
నారాయణపేట: దివ్యాంగులకు బస్‌పాస్‌లు అందించేందుకు బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యేక బస్‌పాస్ మేళా నిర్వహించనున్నట్లు బీవీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కావలి నర్సింహులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేళాకు హాజరయ్యే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో పాటు రూ.50 తీసుకురావాలని సూచించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి డిపో మేనేజర్ యాకయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు సెల్‌నంబర్ 91821 90549 సంప్రదించాలని సూచించారు.
15వ రోజుకు
‘ఎన్‌హెచ్‌ఎం’ దీక్షలు
నారాయణపేట: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీజీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ డిమాండ్లను పోస్టుకార్డులపై రాసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపించారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద పార్క్ వద్ద కొనసాగుతున్న నిరసన శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వామన గేరి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే పీఏ చిట్టెం మాధవరెడ్డి సందర్శించారు. ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్న కుంభం శివకుమార్‌రెడ్డి, వారి డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పార్టీ తరఫున మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం సమ్మె ఖర్చుల నిమిత్తం రూ.8వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి రాఘవేందర్‌తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
బస్‌పాస్‌లకు
దరఖాస్తుల స్వీకరణ
కోస్గి రూరల్: దివ్యాంగులగు బస్‌పాస్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కోస్గి డిపో మేనేజర్ రాజయ్య అన్నారు. మంగళవారం కోస్గి బస్‌స్టేషన్‌లో దివ్యాంగుల నుంచి 30 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సిములు, మండల అధ్యక్షుడు సురేష్, ఏడీసీ భాగ్యమ్మ తదితరులు ఉన్నారు.


