● ధాన్యం నిల్వలు మాయం.. మిల్లు యజమానికి నోటీసు
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని మహేశ్వరి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో జిల్లా పౌరసరఫరాల అధికారి బాలరాజు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ధాన్యం నిల్వలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బకాయిలు, ధాన్యం సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఇప్పటి వరకు జిల్లా పౌరసరఫరాల సంస్థకు కేవలం రూ.8 లక్షల విలువైన బియ్యం మాత్రమే అప్పగించినట్లు గుర్తించారు. ఇంకా రూ.1,95,35,819 విలువైన సీఎంఆర్ బకాయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే బకాయిలకు సంబంధించి ఉండాల్సిన ధాన్యం నిల్వలు మిల్లులో లేకపోవడాన్ని గుర్తించి యజజమానికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి బాలరాజు తెలిపారు. నోటీసుకు సమర్పించే వివరణను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం వినియోగించి సీఎంఆర్ నిర్ణీత గడువులోగా అందించాలని అధికారులు స్పష్టం చేశారు. ధాన్యం నిల్వలు, బకాయిలకు సంబంధించిన లెక్కలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందన్నారు. ప్రభుత్వ ధాన్యం నిర్వహణలో జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.


