అధికారులా..మజాకా! | - | Sakshi
Sakshi News home page

అధికారులా..మజాకా!

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

కొత్త నిబంధనతో చిక్కులు..

●

కోస్గి: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ సీఎం రేవంత్‌రెడ్డి మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంకులు, బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పించడంతో పాటు రాయితీ రుణాలు మంజూరు చేస్తూ అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తూ ఆర్థిక స్వాలంబన సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. కానీ తన ఇలాకాలోని పుర అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వ నిబంధలు ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలు కావాలంటే సంఘంలో ఉన్న సభ్యులందరూ ఇంటిపన్ను చెల్లించాల్సిందేనని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం కోస్గి పురపాలికలో కొనసాగుతున్న ఇంటి పన్ను వసూళ్ల వ్యవహారంతో మహిళలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పన్ను చెల్లించాల్సిందేనంటూ..

మహిళా సంఘాలకు ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వ రుణాలు అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. కాని జిల్లాలో ఎక్కడా లేని విధంగా స్థానిక పుర అధికారులు మహిళా సంఘాల రుణాలు కావాలంటే తమ ఆధార్‌కార్డు ప్రకారం ఇంటిపన్ను చెల్లించాలనే కొత్త నిబంధన అమలు చేస్తున్నారు. కొందరు మహిళలు ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి అద్దె ఇంట్లో ఉంటున్నప్పటికీ ఆధార్‌లో ఉన్న ఇంటినంబర్‌ ప్రామాణికమని, ఇంట్లో నివాసం లేకున్నా పన్ను చెల్లించాలని కఠిన నిబంధలు విధించి బలవంతంగా పన్ను వసూలు చేస్తున్నారు. గ్రూపులో ఉన్న ఏ ఒక్క మహిళా పన్ను చెల్లించకపోయినా గ్రూపు మొత్తానికి రుణం ఇవ్వకుండా నిలిపి వేయడంతో మహిళలు తమలో తాము గొడవ పడుతున్నారు. కొందరు మహిళలు గ్రూపులో ఉన్న సభ్యులకు భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆర్పీలకు మహిళా సంఘాల్లోని సభ్యుల ఇంటి పన్ను వసూళ్ల బాధ్యతను అప్పగించడం మరో విశేషం. జిల్లా అధికారులు స్పందించి ఇంటిపన్ను వసూళ్లపై విచారణ జరిపి ఎలాంటి షరతులు లేకుండా నిబంధల మేరకు రుణాలు అందించాలని సంఘం సభ్యులు కోరుతున్నారు.

మున్సిపాలిటీ మొ.స. రు.అ.పొ.సం. రుణ మొత్తం రు.పొ.సం. పొ.రు. (రూ.కోట్లలో..) (రూ.కోట్లలో..)

నారాయణపేట 763 123 21.55 37 5.30

కోస్గి 392 69 8.80 48 5.69

మక్తల్‌ 267 61 11.24 18 3.80

మద్దూర్‌ 265 26 3.10 16 2.02

మొ.స. : మొత్తం సంఘాలు రు.అ.పొ.సం: రుణానికి అర్హత పొందిన సంఘాలు

రు.పొ.సం: రుణం పొందిన సంఘాలు పొ,రు.: పొందిన రుణం

పురపాలిక వారీగా ఇలా..

మహిళా సంఘాల రుణాలకు ఇంటిపన్నుతో ముడి

లోన్‌ కావాలంటే పన్ను చెల్లించాల్సిందే..!

సభ్యులంతా పన్ను చెల్లిస్తేనే

సంఘానికి రుణం

అద్దె ఇంట్లో ఉన్నా

పాత ఇంటి పన్ను వసూలు

కోస్గి పుర అధికారుల వింత పోకడ

గతంలో పుర పరిధిలోని మహిళా సంఘాలకు మెప్మా తరుఫున ఆర్పీలు అన్నిరకాల పత్రాలు సేకరించిన తర్వాత ఎంసీపీ (సూక్ష్మ రుణ ప్రణాళిక) ఫారంపై వివరాలను ధ్రువీకరిస్తూ మున్సిపాలిటీలో ఉండే మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్‌ సంతకం చేసి బ్యాంకులకు అప్పగిస్తే రుణాలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసే వారు. ప్రస్తుతం కమ్యూనిటీ ఆర్గనైజర్‌తో పాటు పుర కమిషనర్‌ సంతకం కూడా ఉండాలనే నిబంధన తీసుకురావడంతో మహిళా సంఘాలకు ఇబ్బందులు మొదలయ్యాయి. దీనిని ఆసరాగా చేసుకుని కోస్గి మున్సిపాలిటీలో ఇంటిపన్ను చెల్లించిన తర్వాతనే మహిళ సంఘాలకు రుణాలు అందించే కొత్త నిబంధన అనాధికారికంగా అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement