కొత్తపల్లి: మద్దూరు పురపాలికలో రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి అండగా ఉంటామని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో బాధితులతో మాట్లాడారు. కనీసం ఇంట్లోని సామగ్రిని తీయడానికి సమయం ఇవ్వకుండా పోలీసు పహారాలో యంత్రాలతో కూల్చివేశారని బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు. అనంతరం పాత బస్టాండ్ చౌరస్తాలో బాధితులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరి లబ్ధి కోసం పేదల ఇళ్లు కూల్చి రహదారి విస్తరణ చేపడుతున్నారని ప్రశ్నించారు. ఆదుకోవాల్సింది పోయి ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం ఏమిటన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇల్లు, 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వంచర్ల గోపాల్, కౌన్సిలర్లు దినేష్, నర్సంహ, సంగీత శివకుమార్, మౌలానా, గోపాల్, నింగ్యానాయక్ నాయకులు అంజయ్య, బసిరెడ్డి, నందిపాడ్ నరేష్, భీంసేన్, దాసు గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.


