సారూ.. ఇదేమి తీరు! | - | Sakshi
Sakshi News home page

సారూ.. ఇదేమి తీరు!

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

నారాయణపేట: ‘నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాలు రెండు కళ్లు.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కొడంగల్‌కు ఒక్క రూపాయి ఇస్తే.. నారాయణపేటకు కూడా ఇస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2023 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొడంగల్‌ నియోజకవర్గంలోని ఆర్టీసీ బస్టాండ్ల రూపురేఖలు మార్చేందుకు సుమారు రూ.41.83 కోట్లు మంజూరు కాగా.. నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల బస్టాండ్లకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. రూట్లు పెరుగుతున్నాయి.. ప్రయాణికులు పెరుగుతున్నారు.. కానీ బస్టాండ్ల దుస్థితి మాత్రం మారడం లేదు. మరికల్‌లో గుంతలమయం.. మక్తల్‌లో 43 ఏళ్ల నాటి బస్టాండ్‌.. ధన్వాడలో పునాదులకే పరిమితం.. దామరగిద్దలో అధ్వాన బస్‌షెల్టర్‌.. మాగనూర్‌లో రేకుల షెడ్‌.. ఊట్కూరులో పిచ్చిమొక్కల మధ్య బస్టాండ్‌. జిల్లాకేంద్రంలోనూ పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రయాణికుల అవస్థలు. బస్టాండ్ల వారీగా పరిశీలిస్తే..

జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఇది. నిత్యం వందల సంఖ్యలో బస్సుల రాకపోకలు.. వేలాది మంది ప్రయాణికుల ప్రయాణం. కానీ కనీస సౌకర్యాలు మాత్రం కరువయ్యాయి. వర్షం పడితే బస్టాండ్‌ ప్రాంగణమంతా నీటిమయంగా మారుతోంది. పందుల స్వైర విహారం.. దోమల బెడదతో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాలకులు స్పందించి, ఆర్టీసీ అధికారులు చొరవచూసి కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

● దామరగిద్ద మండల కేంద్రం.. మద్దూర్‌, కోస్గి, కానుకుర్తి, యానగుంది తదితర మార్గాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ బస్‌షెల్టర్‌ ఉన్నా.. నిర్వహణ లేక అధ్వానంగా మారింది. ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానలో తడుస్తూ బస్సుల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి. అధికారులు పట్టించుకోక.. పాలకులు స్పందించక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ప్రయాణికులది. బస్టాండ్‌ మంజూరు చేసి ప్రయాణికుల కష్టాలకు చరమగీతం పాడాలని కోరుతున్నారు.

● మరికల్‌ బస్టాండ్‌ గుంతలమయంగా మారింది. బస్టాండ్‌ ఆధునికీకరణకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభంగాక వెనక్కి వెళ్లిపోయాయి. బస్టాండ్‌ మళ్లీ పాత దుస్థితికే చేరింది. బస్సును లోనికి తీసుకెళ్లాలంటేనే డ్రైవర్లు జంకుతున్నారు. అలాగే ప్రయాణికులు దాహం తీర్చుకోవాలంటే బయటి దుకాణాలే దిక్కు. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

● రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్‌ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్‌ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. తాగునీటి ఎద్దడి, ఫ్యాన్లు లేకపోవడం, ఇరుకై న ప్రాంగణంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గకేంద్రమైనా బస్సు డిపో లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రంగా మారాయి. కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. నేటికీ నెరవేరడం లేదు.

● ఊట్కూరు బస్టాండ్‌ ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఏళ్లుగా అదే స్థితిలో ఉంది. 1994లో గ్రామపెద్దల సహకారంతో విరాళాలు సేకరించి భూమి కొనుగోలు చేసి ఆర్టీసీకి దానం చేశారు. అనంతరం సుమారు రూ.5 లక్షలతో 25 ఏళ్ల కిందట బస్టాండ్‌ నిర్మించారు. ఊరు మారుతున్నా.. కాలం మారుతున్నా.. బస్టాండ్‌ మాత్రం మారకపోవడంతో ప్రయాణికులు ఆధునిక సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నారు.

● నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి సొంత ఊరు ధన్వాడలో పూర్తిస్థాయి బస్టాండ్‌ కలగానే మిగిలింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షలతో బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పునాదులు వేశారు. తర్వాత పనులు ముందుకు సాగక పునాదులకే పరిమితమైంది. చివరకు బస్‌షెల్టరే ప్రయాణికులకు ఆధారంగా మారింది.

కొడంగల్‌ నియోజకవర్గ బస్టాండ్ల ఆధునికీకరణకు నిధులు

నారాయణపేట, మక్తల్‌కు మొండిచెయ్యి

కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

మండల కేంద్రాల్లో బస్‌షెల్టర్లే దిక్కు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement