యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
● జిల్లా సరిహద్దులు దాటుతున్న వైనం
● పట్టుబడితే మంత్రులు,
ఎమ్మెల్యేల పీఏలతో ఫోన్లు
● పోలీసులు తరచూ పట్టుకుంటున్నా
ఆగని దందా
–8లో u
మరికల్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు నిరాటంకంగా తమ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ పనుల అనుమతుల పేరిట ఇతర ప్రాంతాలకు యథేచ్చగా తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. నియోజకవర్గ నడ్డిబొడ్డున ఉన్న పెద్దవాగు సరిహద్దున కృష్ణానది నుంచి మహబూబ్‌నగర్‌కు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు ఇసుకను పెద్ద పెద్ద టిప్పర్లలో తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అధికారులు అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పలు సందర్భాల్లో పట్టుకున్నా దందా మాత్రం ఆగడం లేదు. పెద్దవాగు, కృష్ణానది నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పేరుతో ఇసుక తరలిస్తున్నారు. దీంతోపాటు ఇటుకల తయారీకి వినియోగించే బోజు ఇసుక అనుమతుల మాటున కూడా కృష్ణానది ఇసుకను కూడా యథేచ్ఛగా తరలించుకు పోతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌కు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను మరికల్‌లో పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారు.
జిల్లా హద్దులు దాటుతూ..
మక్తల్ పరిధిలోని పెద్దవాగు, కృష్ణానది నుంచి కేవలం నారాయణపేట జిల్లా వరకే రోజుకు ఒక టిప్పరుకు ఒక ట్రిపు చొప్పున అధికారులు అనుమతులు ఇస్తున్నారు. కానీ అక్రమ దందాకు అలవాటుపడ్డ అక్రమార్కులు మాత్రం అధికారులు ఇచ్చిన రసీదుతో కృష్ణానది, పెద్దవాగు నుంచి మాగనూర్, మక్తల్, మరికల్ మీదుగా టిప్పర్లపై గ్రీన్‌మ్యాట్ కప్పి మహబూబ్‌నగర్‌కు ఇసుకను తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ టిప్పర్లను విడిపించుకోవడానికి మంత్రుల, ఎమ్మెల్యేల పీఏలతో ఫోన్లు చేయిస్తున్నారు.
మరికల్ పోలీసులు పట్టుకున్న ఇసుక టిప్పర్లు


