నారాయణపేట: సామాజిక మాధ్యమాల్లో విధ్వేషాలు రెచ్చగొట్టేలా, కుల, మత, ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా పోస్టులు, వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రానున్న పండగల నేపథ్యంలో ప్రజల భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రచారా న్నీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తమకు తెలియని మూలాల నుంచి వచ్చిన వీడియోలు, ఫొటోలు, సందేశాలను వాస్తవ నిర్ధారణ లేకుండా ఇతరులకు పంపవద్దని సూచించారు. గ్రూపుల్లో వచ్చే సందేశాలపై అడ్మిన్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను మంచి పనులు, సమాచార వినిమయానికి మాత్రమే వినియోగించాలని, ఒక్క క్లిక్‌తో సమస్యల్లో చిక్కుకోకుండా ప్రతి పోస్టును షేర్ చేసే ముందు ఆలోచించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.
ఆలయంలో ఎంపీ పూజలు
గద్వాల: జిల్లాకేంద్రంలోని నల్లకుంటలో దాతల సహకారంతో భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమని, భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె నల్లకుంటలో ఆలయ పునర్నిర్మాణ, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, కలిసికట్టుగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు.
పెద్దచింతరేవుల అంజన్న సన్నిధిలో..
ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామిని ఎంపీ డీకే అరుణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 48వ చాతుర్మాస మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహిస్తున్న పూజలకు ఆమె హాజరవగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు విద్యారాజేశ్వర శ్రీపాదుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కేశవాచార్యులు, మద్వాచార్యులు, కిష్టాచార్యులు, ధర్మకర్త గిరిరావు తదితరులు పాల్గొన్నారు.
అఖండ విష్ణు
సహస్రనామ పారాయణం
మహబూబ్‌నగర్ రూరల్: శ్రావణ మాస ఏకాదశిని పురస్కరించుకుని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం అఖండ విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభమైంది. పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా 24 గంటల పాటు నిరంతరంగా పారాయణం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పారాయణంలో భాగస్వాములవుతున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


