తప్పటడుగులకే జై! | - | Sakshi
Sakshi News home page

తప్పటడుగులకే జై!

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: విద్యాశాఖలో స్వార్థ ప్రయోజనాల పర్వం నడుస్తోంది. పాఠశాలల్లో విద్యాబోధన, పర్యవేక్షణను పక్కనబెట్టిన కొందరు గురువులు తమ రూటే సెపరేటు అనేలా పైరవీలకు ప్రాధాన్యమిస్తున్నారు. భావిభారత పౌరులకు విలువలతో కూడిన విద్యనందించాల్సింది పోయి పక్కదారి పడుతున్నారు. నిబంధనలను కాలరాసేలా అడ్డూ అదుపు లేకుండా బేరసారాలకు దిగుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడంతో పాటు మెరుగైన విద్యావ్యవస్థ కోసం కృషి చేయాల్సిన పెద్దలు సైతం తప్పుదారి పట్టిన వారికే జై కొడుతున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌, నారాయణపేటకు సంబంధించి పలు వివాదాస్పద నిర్ణయాలు దుమారం రేపుతున్నాయి. ఆయా జిల్లాల్లో విద్యాశాఖ పారదర్శకత ప్రశ్నార్థకంగా మారగా.. ఉన్నతాధికారుల మౌనం అక్రమాలకు ఊతమిస్తున్నట్లు తెలుస్తోంది.

తొలి నుంచీ వివాదమే..

2024లో సీసీకుంట మండలం నుంచి మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండల విద్యాశాఖ అధికారిగా ఒకరు బదిలీపై వచ్చారు. విధుల్లో చేరిన అనంతరం రెండోరోజు అర్బన్‌ మండల విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి ఎంఈఓ కుర్చీలో కూర్చున్నారు. అక్కడ మహిళా ఎంఈఓ ఇదివరకే విధులు నిర్వర్తిస్తుండగా.. ఆమెను బేఖాతరు చేస్తూ అతడు పెత్తనం చెలాయించడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆమె ఉద్యోగ విరమణ పొందగా.. ప్రస్తుతం ఆయనే అర్బన్‌ మండలానికి ఎంఈఓగా చెలామణి అవుతున్నాడు. అయితే రూరల్‌ మండలంలో పంచాయతీరాజ్‌శాఖ నుంచి వేతనం పొందుతుండడం, అర్బన్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై దుమారం కొనసాగుతోంది.

ఆ తర్వాత సెల్ఫ్‌ డ్రాయింగ్‌ పేరిట..

సీటు లొల్లి సద్దుమణిగిన క్రమంలో తాను అర్బన్‌ మండల ఎంఈఓగా విధులు నిర్వర్తిస్తున్నానని, వేతనం ఇచ్చేందుకు అర్బన్‌లో ఎంపీడీఓ పోస్ట్‌ లేకపోవడంతో సెల్ఫ్‌డ్రాయింగ్‌ పేరిట సొంతంగా వేతనాలు పొందేలా ఆర్జేడీ కార్యాలయంలో చక్రం తిప్పాడు. ఈ మేరకు గతేడాది ఉత్తర్వులు వెలువడ్డాయి. వేతనాలు చేసేందుకు ఎంపీడీఓ లేని క్రమంలో మాత్రమే సెల్ఫ్‌డ్రాయింగ్‌ అధికారాలు వర్తిస్తాయని ఆ ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. లెక్కప్రకారం అర్బన్‌లో ఎంఈఓ పోస్ట్‌ ఉండి.. ఎంపీడీఓ లేని పక్షంలో మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ క్రమంలో అర్బన్‌లో లేని పోస్ట్‌కు సెల్ఫ్‌ డ్రాయింగ్‌ పవర్‌ ఇవ్వాలని తన పలుకుబడిని ప్రదర్శిస్తూ పంచాయతీరాజ్‌ అధికారులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం.

1986 జీఓ ఏం చెబుతోంది..

1986 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంఈఓ పోస్టు మహబూబ్‌నగర్‌ మండల పరిషత్‌కే కేటాయించబడింది. కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత, కార్పొరేషన్‌లో ప్రత్యేకంగా ఎంఈఓ పోస్టు మంజూరు కాలేదు. పంచాయతీరాజ్‌ పరిధిలోని పోస్టును రద్దు చేయాలన్నా, బదిలీ చేయాలన్నా అదే శాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రావాలి. ఇది పట్టించుకోకుండా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

స్పష్టత రావాల్సి ఉంది..

అర్బన్‌లో ఎంఈఓ పోస్టు ఉందని పంచాయితీరాజ్‌ శాఖ నుంచి జీఓ రాలేదు. ఎంఈఓ పోస్టును రూరల్‌ మండలం నుంచి అర్బన్‌ మండలంలోకి మార్చే ప్రక్రియపై సందిగ్ధం ఉంది. పోస్టు మార్పుపై జెడ్పీ సీఈఓ సంబంధిత శాఖకు లేఖరాశారు. అక్కడి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కానీ విద్యాశాఖ నుంచి ఎంఈఓ పోస్టును రూరల్‌ నుంచి అర్బన్‌ మార్చాలని ఆదేశాలు వచ్చాయి. విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. స్పష్టత వచ్చే వరకు ప్రక్రియ ముందుకు సాగదు.

–విజయకుమారి, డీఈఓ, మహబూబ్‌నగర్‌

వివాదాల విద్యాశాఖ..

లేని పోస్ట్‌కు రాయ‘బేరాలు’?

రూరల్‌ ఎంఈఓ పోస్ట్‌ను ఎత్తివేసి అర్బన్‌కు బదిలీ చేస్తూ, సెల్ఫ్‌ డ్రాయింగ్‌ పవర్‌ ఇచ్చినట్లు ఆర్జేడీతో పాటు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఆయన ఇటీవల మరోసారి ఉత్తర్వులు తీసుకురావడం విద్యాశాఖలో సంచలనంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకుని రూరల్‌ నుంచి అర్బన్‌కు ఎంఈఓ పోస్టు బదిలీ చేయాలంటూ జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్‌ అధికారులపై ఒత్తిడి చేయడం పంచాయితీకి దారితీసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని.. తాము చేయలేమంటూ ఆ శాఖ అధికారులు తేల్చిచెప్పడంతో ఈ లొల్లి జిల్లా ఉన్నతాధికారుల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌ పరిధిలో లేని అర్బన్‌ పోస్టు కోసం రూరల్‌ మండల ఎంఈఓ కుర్చీని ఖాళీ చేసేలా సదరు అధికారి రాయబారాలతోపాటు భారీ స్థాయిలో బేరసారాలకు దిగినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

మహబూబ్‌నగర్‌,నారాయణపేటలో ఇష్టారాజ్యం

నిబంధనలకు తిలోదకాలిచ్చిఅనాలోచిత నిర్ణయాలు

కార్పొరేషన్‌ పరిధిలో లేని అర్బన్‌ పోస్టుకు పైరవీల బేరం

రూరల్‌ మండల ఎంఈఓ కుర్చీనిఖాళీ చేసే కుయుక్తులు

పేటలో కాక రేపుతున్న ఓ పథకం ఇన్‌చార్జి వ్యవహారం

అక్రమాలకు ఊతమిస్తున్న ఉన్నతాధికారుల మౌనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement