వృద్ధుల హక్కులపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల హక్కులపై అవగాహన ఉండాలి

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

నారాయణపేట: వృద్ధుల హక్కులు, సంక్షేమం, న్యాయపరమైన రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మీపతిగౌడ్‌ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌ ఆదేశాల మేరకు మండలంలోని శాసన్‌పల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం–2007 గురించి వివరించారు. వృద్ధులను గౌరవించడం, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలోని ప్రతి వర్గం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు అవసరమైన భరణం, వైద్యసేవలు, ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ పథకాలు అందేలా చట్టం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రభుత్వం అందించే పింఛన్లు, పన్ను మినహాయింపులు, బ్యాంకు ఎఫ్‌డీ వడ్డీ ప్రయోజనాలు, ఆరోగ్యబీమా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి సఖి కేంద్రం, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందే సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అర్హులు, నిర్దేశిత ఆదాయ పరిమితిలో ఉన్నవారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సాయం పొందవచ్చని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు టోల్‌ఫ్రీ నంబర్‌ 15100 నంబర్‌కు ఫోన్‌చేసి సమస్యను తెలియజేస్తే తగిన న్యాయ సహాయం, పరిష్కార మార్గాలపై మార్గదర్శనం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ న్యాయవాది క్రాంతి, వ్యవసాయ విస్తరణ అధికారి దినకర్‌, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామ సర్పంచ్‌తో పాటు పోలీసు అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement