అడ్డంకిగా మారుతున్న వివాదాలు | - | Sakshi
Sakshi News home page

అడ్డంకిగా మారుతున్న వివాదాలు

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

పేరపళ్లలో భూ రీ–సర్వే షురూ

అసలు పట్టాదారుల్లో తీవ్ర అసహనం

తలలు పట్టుకుంటున్న సర్వే సిబ్బంది

నారాయణపేట: మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం భూ సేకరణలో భాగంగా మండలంలోని పేరపళ్ల జాయమ్మ చెరువును రిజార్వాయర్‌గా మార్చేందుకు కావాల్సిన 326 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ అధికారులకు అంతుచిక్కని సమస్యగా మారుతోందా..? పదేపదే సర్వేలు నిర్వహిస్తున్నా ఎందుకు స్పష్టత రావడం లేదు..? అసలు పట్టాదారుల అభ్యంతరాలు, భూముల హద్దులు, రికార్డుల మధ్య వ్యత్యాసాలపై తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు..? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భూ సేకరణలో భాగంగా గతంలో నిర్వహించిన సర్వేలపై పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు మరోసారి రీ–సర్వేకు సిద్ధమయ్యారు. ఇందుకోసం నాలుగు సర్వే బృందాలను రంగంలోకి దించారు. దీంతో ఇప్పటికే భూముల వివరాలు నమోదు చేయించుకున్న పట్టాదారుల్లో ఆందోళన మొదలైంది.

సర్వే.. రీ–సర్వే...

భూముల హద్దులు, సర్వేనంబర్లు, పట్టాదారు వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను నిర్ధారించేందుకు అధికారులు సర్వేలు చేపడుతున్నారు. అయితే ఒక దశలో సర్వే పూర్తయిందని భావించినా.. కొన్ని అభ్యంతరాలు, వివాదాలు తలెత్తడంతో మళ్లీ సర్వే చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అసలు ఏ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటారు? అన్న సందేహం పట్టాదారుల్లో వ్యక్తమవుతోంది.

రికార్డులు ఒకలా.. క్షేత్రస్థాయి పరిస్థితి మరోలా...

భూ సేకరణలో పాత రికార్డులు, ప్రస్తుత రెవెన్యూ రికార్డులు, భూముల హద్దులు కీలకంగా మారాయి. రికార్డుల్లో ఉన్న వివరాలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు మధ్య తేడాలు ఉంటే వాటిని పరిష్కరించడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. ఒకే భూమికి సంబంధించి వేర్వేరు హక్కుదారుల వాదనలు తెరపైకి వస్తే.. అసలు పట్టాదారు ఎవరు? ఎవరి పేరున రికార్డు ఉంది? భౌతిక స్వాధీనం ఎవరి వద్ద ఉంది? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది.

– తాజాగా ఏర్పాటు చేసిన నాలుగు సర్వేబృందాలు శుక్రవారం పేరపళ్ల గ్రామానికి చేరుకున్నాయి. తహసీల్దార్‌ పర్యవేక్షణలో మరోసారి భూములను పరిశీలించేందుకు శ్రీకారం చుట్టారు. ఈసారి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి సర్వేనంబర్‌ను పరిశీలించి హద్దులు నిర్ధారించి సంబంధిత రికార్డులతో సరిపోల్చి తుది వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత సర్వే బృందాలపై ఉంది.

ఎవరికి లాభం..?

గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కొందరి మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ కూడా స్థానికంగా వినిపిస్తోంది. అయితే రాజీ పేరుతో అసలు హక్కుదారులకు అన్యాయం జరగకూడదన్నది పట్టాదారుల ప్రధాన డిమాండ్‌. భూమి ఎవరిదైనా.. హక్కు ఎవరిదైనా.. తుది నిర్ణయం మాత్రం అధికారిక రికార్డులు, చట్టబద్ధమైన ఆధారాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగానే ఉండాలని వారు కోరుతున్నారు.

పట్టాదారుల్లో అసహనం..

ఇప్పటికే పలుమార్లు సర్వే చేశారు.. మళ్లీ ఇప్పుడు సర్వే అంటున్నారు.. భూముల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని ప్రక్రియను పూర్తి చేయాలంటూ పలువురు పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ ఆలస్యం కావడంతో భూములపై నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల్లోనూ అసహనం పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement