స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 70 శాతం నిధులు
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
రూ.21.91 కోట్ల మంజూరు
● మహిళా సంఘ భవనాలు,
రద్దీ ప్రాంతాలు,
ఆలయాల వద్ద నిర్మాణాలు
● అక్టోబర్ 2 లక్ష్యంగా పనులు ముమ్మరం
నర్వ: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాల భవనాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మార్కెట్‌యార్డులు, దేవాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధుల్లో 70 శాతం స్వచ్ఛభారత్ మిషన్ నుంచి సమకూరనున్నాయి. మిగిలిన 30 శాతం నిధులను గ్రామ పంచాయతీలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించనున్నారు. మహిళా సంఘాల భవనం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద రూ.52 వేలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.92,747 చొప్పున నిధులు అందించనున్నారు.
17 మరుగుదొడ్లు..
30 మహిళా సంఘాల భవనాలు
జిల్లాలో 17 సామూహిక మరుగుదొడ్లు, మహిళా సంఘాల భవనాల వద్ద 30 మరుగుదొడ్ల నిర్మాణాలను లక్ష్యంగా నిర్ణయించారు. డ్రైనేజీ ఎండింగ్ పాయింట్ల వద్ద 235 సామూహిక ఇంకుడు గుంతలను నిర్మించనున్నారు. ఇందుకోసం గ్రామ పంచాయతీ తీర్మానం, ఎంపీడీఓ అనుమతి తప్పనిసరి చేశారు. ఇప్పటికే నారాయణపేట మండలం కోటకొండ, దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి, గుండుమాల్ మండలం ఆమ్లీకుంట, కొత్తపల్లి మండలం భూనీడు గ్రామ పంచాయతీల్లో కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు.


