పాలమూరు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత
ఇక్కడ కనిపిస్తున్న అతడి పేరు రమేశ్. అతడు చర్మ సమస్యలతో జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చారు. ఓపీ తీసుకుని వైద్యుడి దగ్గరికి వెళ్తే.. ఐదు రకాల మందులు, ఒక అయింట్‌మెంట్ రాశారు. వాటిలో రెండు రకాల మందులతో పాటు అయింట్‌మెంట్ లేదని చెప్పడంతో జనరిక్ దుకాణంలో అయిట్‌మెంట్, మిగతా మందులను బయట కొనుగోలు చేశారు.
వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాఘవేందర్ ముక్కులో కండ పెరగడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ సర్జరీ చేయాలని చెప్పడంతో రెండు వారాల నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రికి తిరుగుతున్నాడు. ఈఎన్‌టీ విభాగంలో కేవలం మందులు రాసి పంపుతున్నారని.. అవి కూడా ఇక్కడ దొరకడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కులో కొట్టుకోవడానికి అవసరమైన స్ప్రే, మందుల కోసం రూ.2 వేల వరకు ఖర్చవుతుందని వాపోతున్నారు.
పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు వికారాబాద్‌కు చెందిన పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేరుకు మాత్రం 650 పడకలతో సేవలు అందిస్తున్నారే తప్ప.. అరకొర వసతులతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా రోగులకు కావాల్సిన మందులు లేక నిత్యం అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతుంది. వాతావరణలో వస్తున్న మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో నిత్యం ఆస్పత్రిలో 1500 నుంచి 1700 మంది వరకు వస్తున్నారు. అదేవిధంగా 150 నుంచి 200 మంది ఆడ్మిట్ అవుతున్నారు. అయితే వైద్యులు రాసే మందుల్లో కొన్ని రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. మిగతా వాటిని బయట తీసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. కొందరు చేసేదిలేక ప్రైవేటులో మందులను కొనుగోలు చేస్తుండగా.. నిరుపేదలు ఇచ్చిన అరకొర మందులు తీసుకొని వెళ్లిపోతున్నారు.
కొన్నింటికి అసలే దొరకవు..
ఆస్పత్రిలో రోజువారి ఓపీలో 20 శాతం మంది గ్యాస్ట్రిక్ సమస్యతో వస్తున్నారు. సంబంధిత వైద్యుడు రాసిచ్చే మందుల కోసం కౌంటర్ వద్దకు వెళ్తే కనీసం ఒక్క రకం ట్యాబ్‌లెట్లు, సిరాప్‌లు కానీ అందుబాటులో ఉండటం లేదు. ఇక బీపీలో కేవలం రెండు రకాలు మాత్రమే ఉండగా.. అవి రోగులకు ఉపయోగకరంగా ఉండటం లేదు. బీపీ రోగుల పరిస్థితి మేరకు వైద్యులు కాంబినేషన్‌లో మందులు రాస్తుంటారు. అలాంటి మందులు కూడా ఆస్పత్రిలో ఉండటం లేదు. షుగర్‌కు సంబంధించి కేవలం రెండు రకాల ట్యాబ్‌లెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇన్సూలిన్ అయితే ఇక అడుగొద్దని చెబుతున్నారు. ప్రధానంగా చర్మ వ్యాధులకు సంబంధించి ఎలాంటి ట్యాబ్‌లెట్లు కానీ, అయింట్‌మెంట్లుకానీ ఉండటం లేదు. మానసిక వైద్యానికి మందులు రాస్తే.. నేరుగా ప్రైవేటు మెడికల్ దుకాణాలకే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
సూది మందులు సైతం..
ఆస్పత్రిలో ఆడ్మిట్ అయిన రోగులకు అత్యవసరమైన ఇంజక్షన్లు ఉండటం లేదు. పాముకాటు విరుగుడు కంటే ముందు ఇచ్చే ఇంజక్షన్లతో పాటు ఫిట్స్ వచ్చిన సందర్భంలో ఇచ్చేవి, అలర్జీకి సంబంధించినవి ఇలా అతి ముఖ్యమైనవి కూడా ఉండకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆస్పత్రి నిర్వహణలో అత్యంత కీలకమైన సిరంజీలు జనరల్ ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. కేవలం 10ఎంఎల్ సిరంజీలు తక్కువ స్టాక్‌తో సర్దుబాటు చేస్తున్నారు. రోగులకు 2 ఎంఎల్, 5 ఎంఎల్ సిరంజీలు కీలకం కాగా, కొన్ని రోజుల నుంచి సరఫరా కావడం లేదు. దీంతో పాటు ఒక ఎంఎల్ సిరంజీలు కూడా స్టాక్ లేవు. అత్యవసరమైన రోగులు మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
కొరత లేకుండా చర్యలు..
జనరల్ ఆస్పత్రిలో కొన్ని రకాల మందులు ఉండటం లేదు. ఈ విషయంపై వారం క్రితం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఎంఈ, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైన మందుల కోసం ఇండెంట్ కూడా పెట్టాం. సర్జరీ సమయంలో, గర్భిణులకు ఇచ్చే వాటితో పాటు అత్యవసరమైన వాటిని బయట కొనుగోలు చేస్తున్నాం. రెగ్యులర్‌గా ఓపీలో ఇచ్చే ట్యాబ్‌లెట్స్, ఇతర డ్రగ్స్‌ను తీసుకోవడం లేదు.
– డా.రంగా ఆజ్మీరా,
జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
ఖాళీగా 194 పోస్టులు..
జనరల్ ఆస్పత్రిలోని 22 విభాగాల్లో మొత్తం 340 పోస్టులకు గాను ప్రస్తుతం 138 మంది విధుల్లో ఉన్నారు. 194 పోస్టులు ఖాళీ ఉండటంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ఇటీవల 15 మంది బదిలీ కాగా.. 12 మంది మాత్రమే విధుల్లో చేరారు. ఇక టెక్నీకల్ విభాగంతో పాటు నర్సింగ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ విభాగాల్లో ఖాళీల కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఉన్న వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొందరు నిత్యం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించడం కూడా సమస్యగా మారింది.
గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్, చర్మ సమస్యలకు బయటి మందులే దిక్కు
ఇంజక్షన్లు సైతం లేక రోగుల అవస్థలు
ఒకవైపు వైద్యులు లేరు.. ఉన్నవారు సమయానికి రారు
పర్యవేక్షణ కరువు.. పట్టించుకోని ఉన్నతాధికారులు


