కోస్గి: రైతులు మూస పద్ధతులను పక్కనబెట్టి వ్యవసాయ అధికారులు, నిపుణులు సూచించిన విధంగా అధునిక పద్ధతులు పాటించడంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ బహుళ శాఖల నిపుణుల బృందం ప్రతినిధులు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు గురువారం గుండుమాల్‌లోని రైతువేధికలో కోస్గి వ్యవసాయ డివిజన్ పరిధిలోని కోస్గి, గుండుమాల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల రైతులతో బృందం సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి రైతుల ప్రధాన అవసరాలు, వారి డిమాండ్లు, సూచనలను నిపుణుల బృందం నమోదు చేసుకుంది. ముఖ్యంగా సోలార్ కంచె, సూక్ష్మ, బిందు సేద్యం పరికరాల రాయితీ, టార్పాలిన్లు, పవర్ స్పేయర్లు, పుట్టగొడుగుల సాగు యూనిట్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, వ్యవసాయ గిడ్డంగులు, డైయిరీ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం సమ ప్రాధాన్యం ఇవ్వడంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉందని పలువురు రైతులు నిపుణులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో భాగంగా రైతుల అభిప్రాయాలను నమోదు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నిపుణుల బృందం తెలిపింది. కార్యక్రమంలో డీడీఏ రేఖ, డీఏఓ సక్రియానాయక్, ఇక్రిశాట్ ప్రిన్సిపాల్ డా. హరికిషన్, శాస్త్రవేత్తలు సుధాకర్, భగవాన్, స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ అధికారి డా. సుష్మా, సెర్ప్ అధికారి రజిత, జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, డీఆర్డీఓ వెంకట్రాములు, ఏడీఓ రామకృష్ణ, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


