క్షతగాత్రులకు సత్వర సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు సత్వర సేవలు అందించాలి

Aug 7 2026 1:02 AM | Updated on Aug 7 2026 1:02 AM

నారాయణపేట: క్షతగాత్రులు, రోగులను గోల్డెన్‌ అవర్‌లోపే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడేలా సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని 108 వాహనాల స్టేట్‌ ఫ్లీట్‌ హెడ్‌ వరప్రసాద్‌రాజు సూచించారు. గురువారం జిల్లాలోని 108, 102 అంబులెన్సులను ఆయన తనిఖీ చేసి అత్యవసర వైద్య పరికరాల పనితీరు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్‌ వచ్చిన వెంటనే స్పందించి బాధితులను సకాలంలో సమీప ఆస్పత్రులకు తరలించాలన్నారు. వాహన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా ఆస్పత్రి సమావేశ మందిరంలో 108, 102 సిబ్బందితో సమావేశమై అత్యవసర వైద్యసేవలపై పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందని జిల్లా మేనేజర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. తనిఖీల్లో ఎగ్జిక్యూటివ్‌ ఉదయ్‌కుమార్‌, సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

జాగిలంతో విస్తృత సోదాలు

నారాయణపేట: ఎస్పీ డా. వినీత్‌ ఆదేశాల మేరకు గురువారం జిల్లాకేంద్రంలో పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈగల్‌ ఫోర్స్‌ బృందం ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్‌ స్నిపర్‌ డాగ్‌ ‘విక్కి’తో బస్టాండ్‌ పరిసరాలు, పాన్‌షాపులు, రెస్టారెంట్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని ఎస్‌ఐ తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌ వ్యక్తి భవిష్యత్‌తో పాటు కుటుంబాన్ని, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా, వినియోగిస్తున్నా గుర్తిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1908, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

పెసర క్వింటా రూ.9,429

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం పెసర క్వింటా గరిష్టంగా రూ.9,429, కనిష్టంగా రూ.6,032 ధర పలికింది. మొత్తం 398 బస్తాల్లో 195.02 క్వింటాళ్ల పెసర మార్కెట్‌కు వచ్చింది.

రీ–ట్రైనింగ్‌

రోబోటిక్స్‌ వర్క్‌షాప్‌

నారాయణపేట ఎడ్యుకేషన్‌ : మండలంలోని జాజాపూర్‌ ఉన్నత పాఠశాలలో గురువారం సోహం అకాడమీ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌కు చెందిన రోబోటిక్స్‌ ఇన్‌ అకాడమిక్స్‌, ఏఎండీ సహకారంతో రీ–ట్రైనింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ విజయ మాట్లాడుతూ.. గతంలో నేర్చుకున్న రోబోటిక్స్‌ అంశాలను మరోసారి ప్రాక్టికల్‌గా గుర్తు చేస్తూ ఎలక్ట్రానిక్స్‌, సెన్సర్లు, మోటార్లు, సర్క్యూట్‌ బిల్డింగ్‌, రోబోటిక్‌ పార్ట్స్‌ వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు తెలిపారు. శిక్షణలో విద్యార్థులు స్వయంగా సర్క్యూట్లు తయారు చేయడం, రోబోటిక్‌ మోడళ్లను రూపొందించడం, వివిధ యాక్టివిటీలో పాల్గొనడంతో తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకుంటారన్నారు. రీ ట్రైనింగ్‌ వర్క్‌షాప్‌తో రోబోటిక్స్‌ క్లబ్‌ కార్యకలాపాలు మరింత చురుగ్గా కొనసాగేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిందని.. అదేవిధంగా విద్యార్థులకు రాబోయో ఆర్‌ఐఏ ఇన్నోవేషన్‌ మేళా వివరాలు తెలియజేసి ఛాలెంజ్‌లో పాల్గొనాలన్నారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. శిక్షణలో 31 మంది బాలికలు, 17 మంది బాలురు, సోహం అకాడమీ ట్రైనర్లు అజయ్‌కుమార్‌, స్వప్న, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement