తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పిన ప్రొ. కొత్తపల్లి జయశంకర్ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎస్పీ డా. వినీత్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయన హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన మేధోపరమైన మార్గదర్శకత్వం, నిబద్ధత, త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. జయశంకర్ కేవలం ఉద్యమకారుడే కాదని.. గొప్ప విద్యావేత్త, ఆలోచనాపరుడు, సమాజ సంస్కర్త అని కొనియాడారు. యువత ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం, విలువలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మహేష్, ఆఫీస్ సూపరింటెండెంట్ శ్యాంసుందర్‌రాజు, ఎస్‌ఐలు పురుషోత్తం, శ్రీనివాసులు, శ్వేత, శిరీష, వివిధ విభాగాల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


