జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి.. ధ్రువీకరణే బీఎల్వోలకు పెద్ద సవాల్
● ఇప్పటి వరకు కేవలం 30 శాతంలోపే..
● చివరి గడువు ఈ నెల 24.. డిజిటలైజేషన్‌పై దృష్టి
● నారాయణపేట, మక్తల్
నియోజకవర్గాల్లో భారీగా పెండింగ్
నారాయణపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్–2026)లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెల 24 నాటికి పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఓటరు జాబితా పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలమని పేర్కొంటూ.. వివరాల నమోదు, పరిశీలన, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌లో జాప్యానికి తావు లేకుండా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎస్‌ఐఆర్‌పై దిశా నిర్ధేశం చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
అమరచింత ముందు.. ఆత్మకూర్ చివర...
అమరచింత మండలంలో 37.31 శాతం పరిశీలన పూర్తయి అగ్రస్థానంలో నిలవగా.. ఊట్కూర్ 36.39, మాగనూర్ 36.08, నర్వ 35.99, కృష్ణా 34.83, మరికల్ 30.13 శాతం పూర్తయ్యాయి. మక్తల్ మండలం 28.66 శాతంతో వెనుకబడగా, ఆత్మకూర్‌లో కేవలం 19.21 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మక్తల్ మండలంలోనే 339 నో మ్యాపింగ్ కేసులు నమోదవడం గమనార్హం. అలాగే పరిశీలన శాతం కూడా 28.66 శాతానికే పరిమితం కావడంతో ప్రత్యేక దృష్టి అవసరమని అధికారులు భావిస్తున్నారు.
నియోజకవర్గం ఓటర్లు పంపిణీ చేసిన డిజిటలైజ్ ధ్రువీకరించినవి నో మ్యాపింగ్
ఫారాలు చేసినవి ఓటర్లు
నారాయణపేట 2,42,773 2,42,340 63,986 63,093 1,602
మక్తల్ 2,52,801 2,51,605 80,870 80,458 873
ధ్రువీకరణలో జాప్యం..
జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయింది. అయితే కీలకమైన బీఎల్వోల ధ్రువీకరణ మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు ఐదు లక్షల మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేసినప్పటికీ ధ్రువీకరణ సగం కూడా పూర్తికాలేదు. గడువు సమీపిస్తుండటంతో పెండింగ్ ధ్రువీకరణలు, నో మ్యాపింగ్ ఓటర్ల పరిష్కారం అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది.
● మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,52,801 మంది ఓటర్లకుగాను 2,51,605 (99.53 శాతం) ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు బీఎల్వోలు 80,458 ఫారాలు (31.83 శాతం) మాత్రమే యాప్‌లో నమోదు చేశారు. మరోవైపు 873 నో మ్యాపింగ్ ఓటర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ధ్రువీకరణ చేయాల్సి ఉండటంతో అధికారులు వేగం పెంచాలని ఆదేశించారు.
నియోజకవర్గాల వారీగా ఇలా..
కోయిల్‌కొండ ముందంజ.. నారాయణపేట వెనుకంజ...
ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన ప్రక్రియలో కోయిల్‌కొండ మండలం 36.59 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. దామరగిద్ద 31.95, ధన్వాడ 28.49, మరికల్ 21.40 శాతం పూర్తవగా.. నారాయణపేట మండలంలో కేవలం 16.15 శాతం పరిశీలన, వివరాల నమోదు పూర్తయింది. నారాయణపేట మండలంలో 707 ఫారాలు బీఎల్వోల ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. 367 నో మ్యాపింగ్ ఓటర్లున్నారు. ధన్వాడలో 570 నో మ్యాపింగ్ ఓటర్లుండటంతో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
రోజుకు 100 ఎంట్రీలు తప్పనిసరి..
ప్రతి బీఎల్వో రోజుకు కనీసం 100 మంది ఓటర్ల వివరాలను యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ప్రతి ఓటరును ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చాలని, విచారణ లేకుండా ఏ ఒక్క ఓటరు పేరును జాబితా నుంచి తొలగించొద్దని, పూర్తిస్థాయి విచారణ అనంతరమే తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
నారాయణపేటలో..
నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయింది. మొత్తం 2,42,773 మంది ఓటర్లుండగా.. 2,42,340 (99.82%) మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. అయితే వాటిలో 63,093 ఫారాలను (25.99%) బీఎల్వోలు పరిశీలించి వివరాలు యాప్‌లో నమోదు చేశారు. 1,602 నో మ్యాపింగ్ ఓటర్లుండటం అధికారులకు సవాలుగా మారింది.
నిర్లక్ష్యం వద్దు..
అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఎన్యూమరేషనన్ ఫారం పూరించి బీఎల్వోకు అందజేయాలి. గతంలో ఓటు వేశామనే కారణంతో నిర్లక్ష్యం చేయవద్దు. – సీహెచ్ ప్రియాంక, కలెక్టర్


