●
ఏం తోచడం లేదు..
నెట్టెంపాడు కాల్వ పరిధిలో నాకు రెండెకరాల పొలం ఉంది. ఈసారి వరిసాగు కోసం నారుమళ్లు వేసుకున్నా. వర్షా లు లేక డ్యాంకు నీరు రాలే దని అధికారులు ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు. మా పొలాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా ఉండవు. ఏం చేయాలో తోచడం లేదు.
– సాయన్న, రైతు, ధరూరు
ఆరుతడి పంటలు వేసుకోవాలి..
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి. వరిపంట వేసుకుని ఇబ్బందులు పడొద్దు. కాల నుగుణంగా పంటలు సాగుచేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారు. – వీరప్ప, డీఏఓ,
సంజీవ్‌ప్రసాద్ ఇరిగేషన్‌శాఖ డీఈ
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ తప్పింది. గతేడాది ఇదే సమయానికి కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడిన జూరాల.. నేడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని వెలవెలబోతోంది. వర్షాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే జూరాల జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గి.. డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు.
10లక్షల ఎకరాల ఆయకట్టు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. మొత్తం 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రతి ఏటా వానాకాలంలో సుమారు 7లక్షల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.
ఆందోళనలో ఆయకట్టుదారులు..
జూరాల ఎడమ, కుడి కాల్వల పరిధిలో మొత్తం 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.56 లక్షలు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ పరిధిలో సుమారు 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద వచ్చి చేరకపోవడంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఈ సమయానికి దాదాపు 50శాతం మేర వరినాట్లు పూర్తయ్యేవి. కాని ఇప్పుడు నారుమళ్లు ముదిరిపోతున్నాయి. కరిగెట్లు చేసుకుని సిద్ధం చేసుకున్న పొలాలు సైతం నీరులేక నెర్రలుబారుతున్నాయి.
జలకళ తప్పిన జలాశయం
వర్షాకాలం మొదలైనా కనిపించని వరద
గతేడాది మే చివరి నాటికే జూరాలలో జలకళ
గడ్డు పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులు
గడ్డు పరిస్థితి..
జూరాల ప్రాజెక్టుకు గతేడాది మే చివరినాటికే వరద వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలో ప్రాజెక్టు 40 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా ఎగువ, దిగువ విద్యుత్ హైడల్ ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి నిరాటకంగా కొనసాగింది. కానీ నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎగువనున్న కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు సైతం పూర్తిగా నిండలేదు. ఫలితంగా జూరాలకు వరద ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో.. లేదో కూడా తెలియని గడ్డు పరిస్థితి నెలకొంది.
జలాశయంలో 5.52 టీఎంసీలు..
జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.290 మీటర్ల మేర ఉంది. 9.567 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం కేవలం 5.523 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా కేవలం 1.916 టీఎంసీల వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. పైగా 30 ఏళ్లుగా జలాశయం పూడిక తీయకపోవడంతో సుమారు రెండున్నర టీఎంసీల బురద పేరుకుపోయింది. ఈ లెక్కన జలాశయంలో ఉన్న నీరు దాదాపుగా డెడ్ స్టోరేజీకి చేరిందని చెప్పవచ్చు.


