దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

కందనూలు: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వట్టెం జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్‌ పూర్ణిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు htt ps://navodaya.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష నవంబర్‌ 28న ఆయా జిల్లాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.

14న అప్రెంటిస్‌షిప్‌ మేళా

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సు (2024, 2025, 2026 విద్యా సంవత్సరం)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 14న అప్రెంటిస్‌షిప్‌ మేళా ఉంటుందని మేళా కో–కన్వీనర్‌ ఎం.జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో జరిగే ఈ మేళాలో హైదరాబాద్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఆస్పత్రులు, సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పదోతరగతి, ఇంటర్‌ మెమోలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లతో పాటు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను తీసుకురావాలని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పాలమూరు వెంకన్నబ్రహ్మోత్సవాలు ప్రారంభం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శ్రీకంచికామకోటి పీఠం పాలమూరుశాఖ 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, గోపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్‌ వరుణ పూజ, గోపూజ, కంకణధారణ, యాగశాల ప్రవేశం, గరుడ ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వేదపారాయణం, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారికి శేషవాహన సేవ నిర్వహించారు. శివాలయంలో నంది వాహన సేవ, నీరాజనం, మంత్రపుష్సాలు, చతుర్వేద స్వస్తీ పూజలు చేశారు. ప్రతి రోజు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ తెలిపారు.

ఓట్లు తొలగించేందుకు కుట్ర : బీఆర్‌ఎస్‌

ఆత్మకూర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నాయని.. అర్హులైన వారి ఓట్లు తప్పిపోకుండా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కార్యదీక్షతో ముందుకెళ్లాలని మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌ నివాసంలో నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్‌ఏలు బీఎల్వోలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారి ఓట్లు నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసిందని.. హామీలే తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పుర మాజీ చైర్‌పర్సన్‌ గాయత్రి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీనివాసులు, విరేష లింగం, మాజీ వైస్‌ ఎంపీపీ కోటేష్‌, నాయకులు యుగంధర్‌రెడ్డి, మండ్ల రామకృష్ణ, రియాజ్‌ అలీ, అంజి, భీమన్న, పాండు, మహబూబ్‌పాషా, షరీఫ్‌, కర్రె శ్రీను, అనీల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ @ రూ.2,730

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,730, కనిష్టంగా రూ.2,505 ధరలు లభించాయి. అదేవిదంగా మొక్కజొన్న గరిష్టంగా రూ.2,406, కనిష్టంగా రూ.1,900, మినుములు రూ.6,600 ధరలు కేటాయించారు. గద్వాల మార్కెట్‌కు గురువారం 1,220 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటా గరిష్టం రూ.7,599, కనిష్టంగా రూ.4,071, సరాసరిగా రూ.6,800 ధరలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement