నారాయణపేట: ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా ఏపీఎస్‌ఈబీ రూల్స్ సాధించే వరకు 1104 యూనియన్ అండగా ఉంటుందని సంఘం డివిజన్ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలో విద్యుత్ ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె ఆదివారం ఐదోరోజుకు చేరింది. 1104 యూనియన్ నారాయణపేట డివిజన్ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ ప్రెసిడెంట్ గోవిందరాజు, సర్కిల్ అదనపు కార్యదర్శి రవీంద్రాచారి, ఎల్‌ఎం అచ్యుతారెడ్డి, భీంరెడ్డి, రమేష్, శాంతకుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీపీఎస్‌లో సమ్మె నిర్వహిస్తున్న కార్మికులకు యాజమాన్యం టర్మినేషన్ నోటీసులు వాట్సప్‌లో పంపించగా యూనియన్ అండగా నిలిచి ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా కృషి చేసిందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సంఘం కార్మికుల పక్షాన పోరాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అవసరమైతే తాము సైతం విధులు బహిష్కరించేందుకు వెనకాడబోమని తెలిపారు. కార్యక్రమంలో టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకుడు రాఘవేదర్‌గౌడ్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ దిల్‌దార్, డివిజన్ చైర్మన్ నర్సింహులు, కో–చైర్మన్ లక్ష్మీకాంత్, రమేష్, కన్వీనర్ జైపాల్, శ్రీధర్, ప్రచారకార్యదర్శి వెంకటేష్, గుండప్ప, మహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.


